Kollywood: కొడైకెనాల్‌లో కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ నటి నటి విష్ణు ప్రియ తండ్రి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సూర్యనారాయణన్ (73) తమిళనాడులోని 'కొడైకొనాల్'లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కుర్చీకి కట్టేసి, ముక్కు-నోటికి టేపులు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన అనంతరం గెస్ట్‌హౌస్‌లో ఉన్న భారీ మొత్తంలో నగదు, బంగారం, ముఖ్య పత్రాలు దుండగులు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.
Details
పర్యాటకుల ముసుగులో నిందితులు
పోలీసుల సమాచారం ప్రకారం, దిండిగల్ జిల్లా పరిధిలోని కొడైకాన్ ప్రాంతంలో, 'కురింజి అండవర్ ఆలయం' సమీపంలో సూర్యనారాయణన్‌కు ఒక గెస్ట్ హౌస్ ఉంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూరుకు చెందిన ఐదుగురు యువకులు పర్యాటకులమని చెప్పి అక్కడ గదులు అద్దెకు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత, గెస్ట్ హౌస్‌లో సూర్యనారాయణన్‌తో పాటు సంరక్షకులు ఆర్ముగం, మురళి మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న నిందితులు ముందుగా ఆ ఇద్దరు సంరక్షకులను తాళ్లతో కట్టేసి, అనంతరం సూర్యనారాయణన్‌ను హత్య చేశారు.
Details
దర్యాప్తు ప్రారంభం
సంరక్షకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఇది దోపిడీ కోసం చేసిన హత్యగా కనిపిస్తున్నప్పటికీ, పాత కక్షల కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. పాత కేసుతో అనుమానాలు గతంలో నటి విష్ణుప్రియ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన డ్రైవర్ హత్య కేసులో సూర్యనారాయణన్ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంతో ప్రతీకార హత్య కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.