LOADING...
Sanchita Ugale: బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య.. ముంబయిలో విషాదం
బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య.. ముంబయిలో విషాదం

Sanchita Ugale: బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య.. ముంబయిలో విషాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయిలో బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అచోలే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా, 22 ఏళ్ల సంచిత ఉరివేసుకుని విగతజీవిగా కనిపించినట్లు సమాచారం. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య సంచిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నట్లు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని తెలిపారు.

వివరాలు 

ముంబయిలోని నలసోపరాలో నివాసం

'కుంకుమ భాగ్య' సీరియల్‌లో దియా టాండన్ పాత్రతో సంచిత ఉగాలే బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 'వాగ్లేకి దునియా', టీవీ డ్రామా 'దిల్‌వాలీ దుల్హా లే జాయేగి' వంటి పలు ధారావాహికల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె ముంబయిలోని నలసోపరాలో తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివాసం ఉంటున్నారు. సంచిత మృతికి సంబంధించిన ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదా ఇతర కీలక ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

ఆమెతో కలిసి పనిచేసిన సహనటులను కూడా విచారిస్తున్న పోలీసులు 

అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని, ఇప్పటికే కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేశామని తెలిపారు. అదే సమయంలో ఆమెతో కలిసి పనిచేసిన సహనటులను కూడా విచారిస్తున్నారు. సంచిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని, నివేదిక అందిన తర్వాత తదుపరి దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. యువ నటి ఆకస్మిక మరణం బుల్లితెర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement