మా నాన్న లైంగికంగా వేధించే వాడంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, సంచలన విషయాలు బయట పెట్టారు. తన ఎనిమిదేళ్ళ వయసులో తన తండ్రి లైంగికంగా వేధించే వారని చెప్పుకొచ్చారు.
ఇటీవల జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఎన్నికైన ఖుష్బూ సుందర్, తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు అందరితో పంచుకున్నారు. మోజో స్టోరీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తండ్రి లైంగిక వేధింపులు విపరీతంగా ఉండేవని, చిన్నతనంలో ఆ బాధను అలాగే భరించాల్సి వచ్చేదనీ అన్నారు.
తన తండ్రి విషయాలను అమ్మతో చెప్పుకున్నా కూడా నమ్మేది కాదనీ, భర్తే ప్రత్యక్ష దైవం అన్న రీతిలో అమ్మ ఉండేదని, భార్యను కొట్టడం తన హక్కుగా తండ్రి భావించే వాడనీ, భార్యనే కాదు పిల్లలను కూడా కొట్టేవాడని ఆమె అన్నారు.
ఖుష్బూ
పదిహేనేళ్ల వయసులో తిరగబడ్డాం అంటున్న ఖుష్బూ
ఇంటి విషయాలను చుట్టాలతో కూడా పంచుకునే వీలు లేకుండేదనీ, తన చిన్నతనమంతా అస్తవ్యస్థంగా ఉండేదనీ, అనుక్షణం భయంభయంగా గడిపే వాళ్ళమనీ చెప్పుకొచ్చారు.
తనకు పదిహేనేళ్ళు వచ్చాక తండ్రికి ఎదురు తిరిగానని, తన పదహారేళ్ల వయసులో తండ్రి వెళ్ళిపోయాడనీ ఆమె అన్నారు. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు జీవితాంతం గుర్తుంటాయని, అప్పటి సంఘటనలు ఇప్పటికీ గుండెల్లో చేదు జ్ఞాపకంగా ఉన్నాయని అన్నారు.
హీరోయిన్ గా, నిర్మాతగా, టెలివిజన్ ప్రెజెంటర్ గా వర్క్ చేసిన ఖుష్బూ, 2010లో డీ ఎమ్ కే లో జాయిన్ అయ్యి రాజకీయ రంగప్రవేశం చేసారు.
ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అక్కడి నుండి కూడా బయటకొచ్చి బీజేపీలో చేరి 2021లో తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసారు. కానీ ఓడిపోయారు.