LOADING...
Prithviraj Sukumaran: లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసు.. దుల్కర్‌, పృథ్వీరాజ్‌ ఇళ్లలో కస్టమ్స్‌ దాడులు
లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసు.. దుల్కర్‌, పృథ్వీరాజ్‌ ఇళ్లలో కస్టమ్స్‌ దాడులు

Prithviraj Sukumaran: లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసు.. దుల్కర్‌, పృథ్వీరాజ్‌ ఇళ్లలో కస్టమ్స్‌ దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran), దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నివాసాల్లో కస్టమ్స్‌ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు భాగంగా ఈ చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా 'ఆపరేషన్‌ నమకూర్‌' పేరిట పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కోచి, తిరువనంతపురంలోని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాలు, పనంపిల్లి నగర్‌లోని దుల్కర్‌ సల్మాన్‌ ఇల్లు సహా పలు ప్రదేశాల్లో తనిఖీలు జరిగాయి. అయితే ఇప్పటివరకు వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ కార్లు లభించలేదని సమాచారం. కేరళలోని కోచి, కోలికోడ్‌, మలప్పురం సహా అనేక ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Details

తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సమాచారం

ఇంటెలిజెన్స్‌ నివేదికల ప్రకారం, భూటాన్‌ ఆర్మీ తమ వాహనశ్రేణి నుంచి కొన్ని విలాసవంతమైన కార్లను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో తక్కువ ధరకు సొంతం చేసుకున్నారు. అనంతరం ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా భారత్‌కు అక్రమంగా తరలించినట్లు సమాచారం. ఈ వాహనాలు హిమాచల్‌ ప్రదేశ్‌ మీదుగా తాత్కాలిక చిరునామాలకు తరలించబడి, అక్కడ నుంచి సినీ, వ్యాపారవర్గాల్లోని కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులకు మాత్రమే విక్రయించినట్లు తెలుస్తోంది. భూటాన్‌-భారత్‌ వాణిజ్య నిబంధనల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఈ స్మగ్లింగ్‌ జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భూటాన్‌ నుంచి వచ్చిన వాహనాలకు సంబంధించిన రసీదులు, ఇతర ఆధారాలను కస్టమ్స్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.