Varanasi: మరో నాలుగు నెలల్లో 'వారణాసి' షూటింగ్ పూర్తి కానుంది: రాజమౌళి
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకధీరుడు రాజమౌళి శుభవార్త అందించారు. మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' చిత్రీకరణ మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన రాజమౌళి, చిత్రంలోని భారీ యాక్షన్ ఘట్టాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో కొనసాగుతోందని చెప్పారు. ప్రధాన భాగాలన్నీ పూర్తయ్యాయని, కథను అనుసంధానించే చిన్నచిన్న సన్నివేశాలను మాత్రమే చిత్రీకరిస్తున్నామని వివరించారు.
వివరాలు
ప్రతి ఫ్రేమింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ..
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్ తొలి వారంలోపు మొత్తం షూటింగ్‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడంపై స్పందించిన రాజమౌళి, కథకు ఆ ఫార్మాట్ మరింత వైభవాన్ని తీసుకువస్తుందని ప్రారంభం నుంచే భావించామని తెలిపారు. అయితే ఐమాక్స్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం చిత్రీకరణ విధానంలో మాత్రమే స్వల్ప సర్దుబాట్లు చేసినట్లు చెప్పారు. సినిమాస్కోప్ ఫార్మాట్‌లో చిత్రీకరణకు తమ బృందం అలవాటు పడినప్పటికీ, ఐమాక్స్‌తో పాటు సినిమాస్కోప్‌లోనూ ఒకే స్థాయిలో విజువల్ అనుభూతి అందించేలా ఫ్రేమింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని రాజమౌళి వివరించారు.
వివరాలు
2027 ఏప్రిల్ 7న విడుదల..
ఇందుకోసం అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ పద్ధతిని అనుసరించామని, ప్రారంభంలో కొన్ని సాంకేతిక సవాళ్లు ఎదురైనా, తర్వాత ఆ విధానంపై పూర్తి అవగాహన రావడంతో చిత్రీకరణ మరింత సులభంగా సాగిందని చెప్పారు. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు, ఇందులో కుంభ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొన్ని కీలక సన్నివేశాలను అత్యుత్తమంగా మలిచేందుకు రాజమౌళి ఏకంగా 90 టేక్‌లు తీసుకున్నారని ఆయన చెప్పడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.