LOADING...
Kriti Sanon: చిత్రపరిశ్రమలో ఇంకా పురుషాధిక్యతే.. కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు
చిత్రపరిశ్రమలో ఇంకా పురుషాధిక్యతే.. కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు

Kriti Sanon: చిత్రపరిశ్రమలో ఇంకా పురుషాధిక్యతే.. కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే వివక్షపై బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు పదేళ్ల సినీ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆమె.. సెట్స్‌లో హీరోలు, హీరోయిన్ల పట్ల వ్యవహరించే తీరు ఇప్పటికీ పూర్తిగా మారలేదని చెప్పారు. షూటింగ్ సమయంలో నటీనటులకు కేటాయించే గదులు, వాహనాల వంటి సౌకర్యాల్లో కూడా తేడా ఉంటుందని కృతి తెలిపారు. అయితే అలాంటి విషయాలను తాను పెద్దగా పట్టించుకోనని, కానీ తనను తక్కువ చేసి చూసే పరిస్థితిని మాత్రం ఎప్పుడూ అంగీకరించనని స్పష్టం చేశారు.

వివరాలు 

నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు

సీనియర్ నటులకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం సహజమేనని అంగీకరించిన ఆమె.. అదే వివక్ష యువ నటీనటుల విషయంలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు. హీరో ఇంకా షూటింగ్‌కు సిద్ధంగా లేకపోయినా, ముందుగానే కథానాయికలను సెట్‌కు పిలిచే పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయని వెల్లడించారు. సినిమా నిర్మాణ ప్రక్రియపై తనకు ఎప్పటి నుంచో ఆసక్తి ఎక్కువగా ఉండేదని, అందుకే దర్శకులను తరచూ ప్రశ్నలు అడిగేదాన్నని కృతి చెప్పారు. అయితే హీరో ప్రశ్నలు అడిగితే అతడికి సినిమాపై ఎంతో ఆసక్తి ఉందని ప్రశంసిస్తారని, అదే హీరోయిన్ సూచనలు లేదా ప్రశ్నలు వేస్తే మాత్రం "నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు" అంటూ విమర్శిస్తారని తెలిపారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఇలాంటి పరిస్థితులను ఎన్నోసార్లు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.

వివరాలు 

సినిమా ప్రమోషన్.. చేదు అనుభవం 

ఈ సందర్భంగా ఓ సినిమా ప్రమోషన్ సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తాను ఎక్కడ పాల్గొనాలి, ఎక్కడ పాల్గొనకూడదనే విషయాన్ని హీరోనే నిర్ణయించారని చెప్పారు. అది తనకు ఎంతో వింతగా, అవమానకరంగా అనిపించిందని తెలిపారు. తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు, తన అవసరం లేకుండా వారు ప్రమోషన్లు నిర్వహించుకోవచ్చని భావించి తాను పక్కకు తప్పుకున్నానని చెప్పారు. అయితే దర్శకుడి కోరిక మేరకు చివరికి ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని వెల్లడించారు.

Advertisement

వివరాలు 

చిత్రపరిశ్రమలో పురుషాధిక్యత

గతంలో సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎక్కువగా గ్లామర్‌కే పరిమితమయ్యేవని, ఆ పాత్రలకు సరైన నేపథ్యం కూడా ఉండేది కాదని కృతి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంత మారుతోందని, నటీమణులు కూడా కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారని చెప్పారు. అయినప్పటికీ చిత్రపరిశ్రమలో పురుషాధిక్యత పూర్తిగా తగ్గలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, కృతి సనన్ ఇటీవల దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కించిన 'కాక్‌టెయిల్ 2' చిత్రంలో నటించారు. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదలైంది.

Advertisement