30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ
నటి మంచు లక్ష్మీ తన గొప్ప మనసును మరోసారి చాటుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన సేవా దృక్పథాన్ని తెలియజేసారు. తాను స్థాపించిన టీచ్ ఫర్ ఛేంజ్ స్వఛ్ఛంద సంస్థ కార్యక్రమంలో భాగంగా 30స్కూళ్ళను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న స్కూళ్ళలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం, డిజిటల్ ఎడ్యుకేషన్ మొదలగు అవసరాలను మంచు లక్ష్మీ తీర్చనున్నారు. స్కూళ్ళను దత్తత తీసుకునే విషయమై జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతితో బుధవారం సమావేశమయ్యారు మంచు లక్ష్మీ. 30స్కూళ్ళను దత్తత తీసుకుంటున్నట్లు పత్రాలపై సంతకాలు చేసారు.
యాదాద్రి భువనగిరిలో 56 పాఠశాలలు
ఇప్పుడే కాదు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 56పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసారు మంచు లక్ష్మీ. కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ ఎడ్యుకేషన్, స్కూళ్ళలో వసతులను ఈ 56స్కూళ్ళలో ఏర్పాటు చేసినట్లు మంచులక్ష్మీ చెప్పుకొచ్చారు. అదే విధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో దత్తత తీసుకున్న 30పాఠశాలల్లోనూ పనులు చేస్తామని, ఆగస్టు లోగా మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు ప్లానింగ్ సిద్ధమైపోయిందని మంచులక్ష్మీ తెలియజేసారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో సమానంగా పోటీ పడేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చేందుకే దత్తత తీసుకున్నానని ఆమె వెల్లడించారు.