మిస్ యూనివర్స్ 2023: బంగారు పక్షి కాస్ట్యూమ్ లో దివితా రాయ్
71వ మిస్ యూనివర్స్ ఈవెంట్ లో భారతదేశం తరపున దివితా రాయ్ పాల్గొంటుంది. ఈ ఈవెంట్ లో భాగంగా జాతీయ విభాగంలో బంగారు పక్షి కాస్ట్యూమ్ లో దర్శనమిచ్చింది దివితా రాయ్. ఈ కాస్ట్యూమ్ గురించి సోషల్ మీడియా చర్చ నడుస్తోంది. భారతదేశాన్ని బంగారు పక్షిగా అభివర్ణిస్తూ ఈ డిజైన్ ని సిద్ధం చేసారట. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది దివితా రాయ్. భారతదేశాన్ని బంగారు పక్షిగా అభివర్ణించడానికి కారణాలు చెప్తూ, ఘనమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక సారాంశాలు, భిన్నత్వంలో ఏకత్వం అనేది బంగారంతో సమానమని తెలిపింది. బంగారు పక్షి కాస్ట్యూమ్ అనేది ఆధునిక భారతదేశాన్ని సూచిస్తుందని చెప్పింది. ఢిల్లీకి చెందిన అభిషేక్ శర్మ ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేసారు.
స్వచ్చమైన గుణాన్ని తెలియజేసే బంగారు పక్షి కాస్ట్యూమ్
ఈ కాస్ట్యూమ్ గురించి డిజైనర్ మాట్లాడుతూ, ఈ డ్రెస్ కి బంగారు పక్షి అని పేరు పెట్టడానికి కారణం, బంగారం లాంటి స్వఛ్ఛమైన భారతదేశాన్ని చూపించడమే అని అన్నారు. స్వఛ్ఛమైన బంగారం మృదువుగా, ఎలా కావాలంటే అలా మారే విధంగా ఉంటుంది. దేశం కూడా ఎన్ని భిన్నత్వాలున్నా, వాళ్ళందరినీ కలిపే ఏకత్వం కలిగి ఉందని చెప్పుకొచ్చారు. ఈ డ్రెస్ రెక్కల గురించి మాట్లాడిన డిజైనర్ శర్మ, కష్ట సమయాల్లో ప్రపంచం పట్ల భారతదేశం చూపిన సంరక్షణకు సూచన అని, ప్రపంచమంతా ఒకే కుటుంబం అని తెలుపుతుందని అన్నారు. మోడల్ గా ఉన్న దివితా రాయ్, మిస్ యూనివర్స్ ఇండియా 2022 టైటిల్ అందుకుంది. మిస్ యూనివర్స్ 2023 కాంపిటీషన్ కి సిద్ధమవుతోంది.