Monalisa Bhosle: 'మోనాలిసా పారిపోయింది'.. వీడియో విడుదల చేసిన ఫర్మాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా జీవితం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. హిందీ చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్న సమయంలోనే కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం ఆరంభం నుంచే వివాదాస్పదమైంది. మోనాలిసా పెళ్లిపై ఆమె తల్లిదండ్రులతో పాటు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ వివాహాన్ని 'లవ్ జిహాద్'గా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు.
వివరాలు
పోలీసుల దర్యాప్తు
అంతేకాక పెళ్లి జరిగిన సమయంలో మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలేనని వెలుగులోకి రావడంతో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇలాంటి వివాదాల నడుమ ఇప్పుడు మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మోనాలిసా అదృశ్యమైందనే వార్త కలకలం రేపుతోంది. ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మేర్, పుష్కర్ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఆమె కనిపించకుండా పోయిందని ఫర్మాన్ ఖాన్ వీడియో ద్వారా వెల్లడించాడు. "మోనాలిసా పారిపోయింది.. ఆమె కోసం అజ్మేర్ అంతా వెతికాను.. ఇప్పుడు జోధ్‌పూర్ వెళ్తున్నాను" అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు
పోక్సో చట్టం కింద కేసు నమోదు
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) నిర్వహించిన విచారణలో మోనాలిసా మైనర్ అని, ఆమె వయసు 16 సంవత్సరాలేనని నిర్ధారణ అయింది. తప్పుడు ధృవపత్రాలతో ఆమెను వివాహం చేసుకున్నారనే ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తె అదృశ్యానికి అతడే కారణమని, పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడని వారు అంటున్నారు. గత 15 నుంచి 20 రోజులుగా తమ కుమార్తెతో మాట్లాడనివ్వడం లేదని, ఆమె పరిస్థితి ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నామని వారు వాపోతున్నారు.