Loading...
MRP Review : ఎంఆర్పీ మూవీ రివ్యూ.. శవం చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ.. నవ్వులు పంచిందా?
ఎంఆర్పీ మూవీ రివ్యూ.. శవం చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ.. నవ్వులు పంచిందా?

MRP Review : ఎంఆర్పీ మూవీ రివ్యూ.. శవం చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ.. నవ్వులు పంచిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

నరేష్ అగస్త్య హీరోగా తెరకెక్కిన 'ఎంఆర్‌పీ' (MRP) చిత్రం 'నీకెంత.. నాకెంత' అనే ఉపశీర్షికతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సుదర్శన్, డోనాల్ బిస్త్, కసిరెడ్డి రాజ్ కుమార్, హర్షవర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీరాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రలు పోషించారు. జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ముందురోజే ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.

వివరాలు

కథ

మనోహర్ (నరేష్ అగస్త్య), దూళ్ల రవి (కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు (సుదర్శన్) కాలేజీ రోజుల నుంచే ప్రాణ స్నేహితులు.

ఒక రోజు వీరంతా ఎస్‌ఐ శంకర్‌ (చైతన్య జొన్నలగడ్డ) ఎదుటకు వెళ్లి తమ వ్యాపారాన్ని ఎవరో నాశనం చేశారని చెబుతూ తమ కథను వివరిస్తారు.

హైదరాబాద్‌లో బ్యాచిలర్ రూమ్‌లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న ఈ ముగ్గురిలో మనోహర్‌కు వ్యాపారం పెట్టి పెద్ద స్థాయికి వెళ్లాలనే కల ఉంటుంది.

ఆ ఆలోచనలో ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో అతని ప్రేయసి అమృత (డోనాల్ బిస్త్)తో విభేదాలు ఏర్పడి బ్రేకప్ వరకు వెళ్తాయి.

మరోవైపు పరమేశ్వరరావు ర్యాపిడో డ్రైవర్ ఉద్యోగం కూడా కోల్పోతాడు. చివరికి ఇద్దరూ కలిసి రవి ఉద్యోగం కూడా పోయేలా చేస్తారు.

వివరాలు

ఆసక్తికరంగా  పాత్రలు

వ్యాపారం ప్రారంభించేందుకు ఇంట్లో డబ్బులు అడిగినా నిరాకరణ ఎదురవుతుంది.

దీంతో మ్యాగ్నెట్ (వెన్నెల కిశోర్) సాయంతో రౌడీషీటర్ దైవాజీ (నంద గోపాల్) వద్ద నుంచి రూ.50 లక్షలు అప్పుగా తీసుకుంటారు. దైవాజీకి తన తండ్రి, తమ్ముడు భాను (గగన్ విహారి)తో తీవ్ర విభేదాలు ఉంటాయి.

వ్యాపారం విఫలమవడంతో వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితిలో దైవాజీ ఇంటికి వెళ్లిన ముగ్గురు, అక్కడ అతను తన తండ్రిని తీవ్రంగా అవమానించడం చూస్తారు.

ఆ షాక్‌తో దైవాజీ తండ్రికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవవు. అనంతరం దైవాజీ, భాను మధ్య తండ్రి మృతదేహం విషయంలో గొడవ చెలరేగుతుంది.

ADVERTISEMENT

వివరాలు

మూవీలో ట్విస్టులు

ఇదే అవకాశంగా భావించిన ముగ్గురు ఆ మృతదేహాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి అప్పు తీర్చాలని నిర్ణయిస్తారు.

కానీ వారు కిడ్నాప్ చేసినది దైవాజీ తండ్రి మృతదేహం కాకుండా మందాకిని అనే మహిళ మృతదేహమని తెలిసి షాక్ అవుతారు.

అసలు మందాకిని ఎవరు? దైవాజీ తండ్రి మృతదేహం ఎక్కడికి వెళ్లింది? దైవాజీ కుటుంబంలో విభేదాల కారణమేంటి? ముగ్గురు స్నేహితులు అప్పు తీర్చగలిగారా? మనోహర్ ప్రేమకథ ఏ మలుపు తిరిగింది? పోలీసు అధికారి (హర్షవర్ధన్)తో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? వారు ప్రారంభించిన వ్యాపారం ఏది? దానిని ఎవరు నాశనం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ADVERTISEMENT

వివరాలు

సినిమా ఎలా ఉంది?

ఈ సినిమాకు పెద్దగా ప్రచారం జరగలేదు. విడుదలకు ముందు ప్రేక్షకుల్లో బజ్ కూడా కనిపించలేదు. ముగ్గురు ప్రధాన పాత్రల పేర్ల మొదటి అక్షరాలతో 'MRP' అనే టైటిల్ పెట్టడం ఆసక్తికరంగా ఉంటుంది.

ముగ్గురు స్నేహితులు ఒక సమస్యలో చిక్కుకుని దాన్నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో గతంలోనూ అనేక సస్పెన్స్ కామెడీ చిత్రాలు వచ్చాయి.

ఈ సినిమా కూడా అదే తరహా కథతో సాగుతుంది. మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది.

ముగ్గురు హీరోల పరిచయ సన్నివేశాలు, హీరో బిజినెస్‌పై పాట, హీరోయిన్‌తో ప్రేమ గీతం వంటి సన్నివేశాలు అవసరానికి మించి లాగిన భావన కలిగిస్తాయి. వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే కామెడీ ట్రాక్ కాస్త పుంజుకుంటుంది.

వివరాలు

ఆసక్తికరంగా సెకాండాఫ్

సెకండ్ హాఫ్‌లో దైవాజీ తండ్రి మృతదేహం కోసం ముగ్గురు స్నేహితులు, మ్యాగ్నెట్, పోలీసు, భాను, దైవాజీ అందరూ వెతికే క్రమంలో మృతదేహం ఒకరి దగ్గర నుంచి మరొకరి చేతికి మారుతూ సస్పెన్స్‌ను కొనసాగిస్తుంది.

ముఖ్యంగా సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ పోలీసుతో చేసే కామెడీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

అయితే మృతదేహం చుట్టూ సాగే ఎపిసోడ్లను కొంత ఎక్కువగా సాగదీసిన భావన కలుగుతుంది. మందాకిని ఫ్లాష్‌బ్యాక్ ఆకట్టుకుంటుంది.

క్లైమాక్స్‌లో మృతదేహం మళ్లీ ముగ్గురు స్నేహితుల వద్దకు రావడం, అక్కడి పరిణామాలు ఆసక్తికరంగా సాగుతాయి. మొత్తానికి ఇది టైంపాస్ కోసం చూసే సినిమా. లేకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫార్వర్డ్ చేస్తూ చూడదగ్గ చిత్రంగా అనిపిస్తుంది.

వివరాలు

నటీనటుల నటన

నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో పర్వాలేదనిపించాడు. అయితే సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ తమ కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు.

వెన్నెల కిశోర్, హర్షవర్ధన్ కొన్ని సందర్భాల్లో నవ్వులు పంచారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తక్కువసేపే కనిపించినా గుర్తుండిపోయేలా చేశారు.

డోనాల్ బిస్త్‌కు పరిమితమైన పాత్రే దక్కింది.

స్నేహ సింగ్ గ్లామర్‌తో పాటు తన పాత్రకు న్యాయం చేసింది. నంద గోపాల్, చైతన్య జొన్నలగడ్డ, గగన్ విహారి తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

వివరాలు

సాంకేతిక అంశాలు

సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోదు. రీ-రికార్డింగ్ కూడా మరింత మెరుగ్గా ఉండాల్సింది.

పాటలు గుర్తుండిపోయేలా లేవు. కొన్ని చోట్ల డబ్బింగ్ లోపాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మొదటి భాగంలో ఎడిటింగ్ మరింత కచ్చితంగా చేసి కొన్ని సన్నివేశాలు తగ్గించి ఉంటే బాగుండేది.

పాత సస్పెన్స్ కామెడీ కాన్సెప్ట్‌ను దర్శకుడు ఎంచుకున్నప్పటికీ, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.

వివరాలు

తీర్పు

'MRP' ఓ మృతదేహం చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ చిత్రం. మొదటి భాగంలో ఓపిక అవసరం. రెండో భాగంలో సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ కామెడీ కొంత వినోదాన్ని అందిస్తుంది.

కొత్తదనం ఆశించకుండా, టైంపాస్ ఎంటర్‌టైనర్‌గా చూస్తే ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.25/5

ADVERTISEMENT