లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాతో వస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ
భారత క్రికెట్ జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, 20-20 ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్నాక ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో సినిమా ప్రొడక్షన్ కంపెనీని మొదలు పెట్టాడు. ఈ విషయమై కొన్ని రోజుల క్రితం ప్రకటన చేసారు. తాజాగా ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ నుండి మొదటి సినిమా ప్రకటన వచ్చేసింది. "లెట్స్ గెట్ మ్యారీడ్" అనే టైటిల్ తో తమిళ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా, లెట్స్ గెట్ మ్యారీడ్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు.
రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న లెట్స్ గెట్ మ్యారీడ్
ఇతర ప్రధాన పాత్రల్లో కమెడియన్ యోగిబాబు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా ఉండనున్నారని వెల్లడి చేసారు. మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదో రొమాంటిక్ కామెడీ అని, యువతను దృష్టిలో పెట్టుకుని సినిమా రూపొందుతుందని అర్థం అవుతోంది. లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమాకు సాంకేతికంగా ధోనీ భార్య సాక్షి సింగ్ నిర్మాతగా ఉన్నారు. రమేష్ థమిల్మని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు చేస్తున్నారనేది వెల్లడి చేయలేదు. హీరో హరీష్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో నాని కొడుకుగా హరీష్ కళ్యాణ్ కనిపించాడు. ఇకపోతే హీరోయిన్ ఇవానా ఈ మధ్య విడుదలైన లవ్ టుడే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.