బాలీవుడ్: పరిణీతి చోప్రా, రాఘవ్ చడ్డా వివాహానికి ముహూర్తం ఫిక్స్, ఎప్పుడు జరగనుందంటే?
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా వివాహం చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ మే నెలలో నిశ్చితార్థం జరిగింది. అప్పటినుండి వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. తాజాగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి ముహూర్తం కుదిరిందని వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో సెప్టెంబర్ 23, 24వ తేదీల్లో వీరి వివాహం జరగనుందని సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సమీప బంధువులు, స్నేహితులు, రాజకీయ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం 200మంది అతిథులు 50మంది గెస్టులు ఈ పెళ్లికి హాజరు అవుతున్నారు.
వివాహానికి విచ్చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్?
ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుండి పెళ్లి పనులు మొదలవుతాయని తెలుస్తోంది. పెళ్లికి వచ్చే వీవీఐపి గెస్ట్ ల కోసం లీలా ప్యాలెస్ దగ్గర్లోని ప్రముఖ హోటల్స్ బుక్ అయిపోయాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ హోటల్స్ ని పూర్తిగా తనిఖీ చేసినట్లు సమాచారం. రాఘవ్ చద్దా ఆప్ ఎమ్మెల్యే కాబట్టి ఈ వివాహానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ మాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇంకా పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్ కూడా ఈ వివాహ వేడుకలో కనువిందు చేయనున్నారు.