Loading...
Nanna Kutty Movie Review: నాన్న కుట్టి మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
నాన్న కుట్టి మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?

Nanna Kutty Movie Review: నాన్న కుట్టి మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తుంటారు నటుడు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం 'అప్ప కుట్టి'.. 'నాన్న కుట్టి' పేరుతో తెలుగులో విడుదలైంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథ, కథనం ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం.

వివరాలు

కథేంటంటే..

సూర్య (విజయ్ ఆంటోని)కి తన కూతురు దియా (బేబీ లిథన్య) అంటే పంచప్రాణాలు. నెలల వయసున్నప్పుడే ఆ బిడ్డను తీసుకుని వైజాగ్ నుంచి పారిపోయి ఊటీలో స్థిరపడతాడు.

అక్కడే సినిమా ప్రొడక్షన్ లొకేషన్ మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దియా చదువుతున్న పాఠశాలలో టీచర్‌గా పనిచేసే అనిత (ప్రీతి అస్రాని).. సూర్యను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.

అయితే తన గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. ఆ వెంటనే కూతురిని తీసుకుని దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు.

ఈ విషయం తెలియడంతో దియా స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తిస్తారు.

వివరాలు

మూవీ చూడాల్సిందే

ఆ పాప ప్రాణాలను కాపాడాలంటే ఆమె కన్నతల్లిదండ్రులు మరో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంటుందని చెబుతారు.

సరిగ్గా అప్పుడే దియాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటపడుతుంది.

ఇంతకీ ఆ విషయం ఏంటి? దియాకు వచ్చిన ప్రాణాంతక వ్యాధి ఏమిటి? అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని కాపాడుకునేందుకు సూర్య ఏం చేశాడు? అన్నది తెరపై చూడాల్సిందే.

ADVERTISEMENT

వివరాలు

ఎలా ఉందంటే..

తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ అల్లుకున్న కథ ఇది. టీజర్, ట్రైలర్లతోనే సినిమా భావోద్వేగభరితంగా సాగుతుందనే విషయాన్ని మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే ప్రచార చిత్రాల్లో చూపించకుండా దాచిన మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా కథలో ఉంది. విజయ్ ఆంటోని ఆ పాయింట్‌ను నమ్మే ఈ సినిమాను భుజాన వేసుకుని ఉండొచ్చు.

కానీ, అసలు కథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఆ మలుపు వచ్చే వరకు కథనంలో పెద్దగా కదలిక కనిపించదు.

బస్టాండ్‌లో ఓ రౌడీ ముఠాతో పోరాడి కూతురిని తీసుకుని హీరో ఊటీకి పారిపోయే సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కానీ, ఆ తర్వాత కథ నెమ్మదిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి

ఒకవైపు తండ్రీకూతుళ్ల అనుబంధం, మరోవైపు టీచర్ వన్‌సైడ్ లవ్‌స్టోరీతో కథ ముందుకు సాగకుండా అక్కడక్కడే తిరుగుతుంది.

చనిపోయిందని భావించిన దియా తల్లి కథానాయిక కంట పడినప్పటి నుంచే ఆసక్తి మొదలవుతుంది.

పాప తీవ్ర అనారోగ్యానికి గురికావడం, ఆమెకు ప్రాణాంతక వ్యాధిఉన్నట్లు బయటపడటం కథలో సంఘర్షణను పెంచుతాయి.

చక్కటి ట్విస్ట్‌తో ప్రథమార్ధానికి విరామమివ్వడం ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది.

ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త వేగంగా సాగుతుంది. అయినప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న ప్రధాన పాయింట్‌ను ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయాడు. సూర్య గతం, అతడి బ్రేకప్ లవ్‌స్టోరీ పెద్దగా కనెక్ట్ కావు.

దియా అతడి జీవితంలోకి ఎలా వచ్చిందనే విషయం కన్విన్సింగ్‌గా అనిపించినా.. ఆమె తల్లిదండ్రులకు దూరం కావడం వెనుక చూపించిన కారణం మాత్రం నాటకీయంగా అనిపిస్తుంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే..

కూతురి ప్రాణాలను కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు, ఆమె తల్లిదండ్రులను సాయం కోసం ఒప్పించడానికి పడే తిప్పలు మెలోడ్రామాలా సాగుతాయి.

ప్రీక్లైమాక్స్‌లో వచ్చే కోర్టు రూమ్ డ్రామా ఫర్వాలేదనిపిస్తుంది.

ఇక పతాక సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బేబీ లిథన్య నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.

కూతురిని అమితంగా ప్రేమించే మధ్యతరగతి తండ్రి సూర్య పాత్రలో విజయ్ ఆంటోని ఒదిగిపోయారు.

భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. టీచర్ అనితగా ప్రీతి అస్రాని సింపుల్ లుక్స్‌తో క్యూట్‌గా కనిపించింది.

కథలో ఆమె పాత్ర కీలకమైనదే అయినా.. నటనకు పెద్దగా ఆస్కారం దక్కలేదు.

వివరాలు

ప్రభావం చూపలేకపోయిన విజయ్ ఆంటోని

బేబీ లిథన్య తన క్యూట్ లుక్స్‌తో పాటు భావోద్వేగభరితమైన నటనతో ఆకట్టుకుంది. హరి ప్రియ, అరువి మదన్, భగవతి పెరుమాళ్, జెన్సన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

దర్శకుడు మారన్ రాసుకున్న కథలో కొత్తదనం ఉన్నప్పటికీ.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబడ్డారు.

ఎడిటర్‌గా విజయ్ ఆంటోని ప్రభావం చూపలేకపోయారు. సినిమాలో కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

సంగీత దర్శకుడిగా మాత్రం విజయ్ ఆంటోని ఫర్వాలేదనిపించారు. నేపథ్య సంగీతం కథకు భావోద్వేగ వాతావరణాన్ని అందించింది. రాజీవ్ రాజేంద్రన్ విజువల్స్ బాగున్నాయి.

వివరాలు

బలాలు

విజయ్ ఆంటోని, బేబీ లిథన్య నటన

కథలోని కొత్త పాయింట్

విరామ సన్నివేశాలు

బలహీనతలు

నెమ్మదిగా సాగే కథనం

ఆశించిన స్థాయిలో లేని సంఘర్షణ చివరిగా: 'నాన్న కుట్టి'.. కొత్త పాయింట్ ఉన్నా ఆకట్టుకోని మెలోడ్రామా!

ADVERTISEMENT