ధమాకా రైటర్ ని డైరక్టర్ గా మారుస్తున్న నాగార్జున, కోట్లలో పారితోషికం?
గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జునకు సరైన విజయం రాలేదు. బంగార్రాజు తర్వాత ఘోస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నాగార్జున ఏ సినిమా చేస్తున్నాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త కథల కోసం నాగార్జున ఎదురుచూస్తున్నాడని మాత్రం వినిపించింది. తాజా సమాచారం ప్రకారం కొత్త కథ దొరికేసిందని టాక్. ఆ కొత్త కథను వినిపించింది ఎవరో కాదు, రవితేజ నటించిన ధమాకా సినిమాకు కథ, మాటలు స్క్రీన్ ప్లే అందించిన బెజవాడ ప్రసన్న కుమార్ అని చెప్పుకుంటున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ ఆల్రెడీ కథ వినిపించారని, సినిమా చేయడానికి నాగార్జున ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో రైటర్ ప్రసన్న, దర్శకుడిగా మారబోతున్నాడట.
కొత్త డైరెక్టర్ కి కోట్లలో పారితోషికం
ఐతే దర్శకుడిగా ప్రసన్న కుమార్ చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో నాగార్జున అంతగా ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పుకున్నాడని అంటున్నారు. "ధమాకా" రైటర్ ని దర్శకుడిగా మారుస్తూ 2కోట్ల పారితోషికం ఇస్తున్నాడని అనుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు నిజమైతే ప్రసన్నకు మంచి అవకాశం లభించినట్టే. రైటర్ గా తన ప్రతిభను ధమాకాతో చూపించిన ప్రసన్న, దర్శకుడిగా ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి. రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ధమాకా మూవీ, బాక్సాఫీసు వద్ద వందకోట్ల వసూళ్ళను సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రవితేజ కెరీర్లో ఇదే అత్యధికం.