LOADING...
Nagarjuna: 'లెనిన్'లో అఖిల్ సెట్ అవుతాడా అనిపించింది: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
'లెనిన్'లో అఖిల్ సెట్ అవుతాడా అనిపించింది: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

Nagarjuna: 'లెనిన్'లో అఖిల్ సెట్ అవుతాడా అనిపించింది: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'లెనిన్' సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తొలిసారి కథ చెప్పడానికి వచ్చినప్పుడు సినిమా శ్రీరామపురం నేపథ్యంలో సాగుతుందని చెప్పాడన్నారు. మొదట అది తన తండ్రి జన్మస్థలం అయిన కృష్ణా జిల్లాలోని శ్రీరామపురమని అనుకున్నానని, తర్వాత అది చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురమని తెలిసిందని చెప్పారు. అయినప్పటికీ ఆ పేరు తనకు సెంటిమెంట్‌గా అనిపించిందన్నారు.

వివరాలు 

లెనిన్ జీవితానికి హార్ట్‌బీట్‌లా.. భారతి పాత్ర

సినిమాలోని ట్విస్టులను ఎంత ఊహించినా ప్రేక్షకులు ముందుగానే అంచనా వేయలేరని నాగార్జున తెలిపారు. ప్రేమ కంటే గొప్ప భావోద్వేగం మరొకటి లేదని, 'లెనిన్' కూడా అలాంటి హృదయాన్ని తాకే ప్రేమకథేనని అన్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే పోషించిన భారతి పాత్ర, లెనిన్ జీవితానికి హార్ట్‌బీట్‌లా ఉంటుందని పేర్కొన్నారు. సినిమాలో నటించిన శివాజీ, బ్రహ్మాజీ, సునీల్‌ల గురించి కూడా నాగార్జున ప్రస్తావించారు. శివాజీ తమ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడని, బ్రహ్మాజీతో తమ అనుబంధం చాలా కాలం నాటిదని చెప్పారు. సునీల్‌తో ఎన్నో సినిమాలు చేశానని, వీరంతా అఖిల్ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు.

వివరాలు 

'లెనిన్' రాయలసీమ మట్టి

నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి మాట్లాడుతూ.. అందరూ ఆయనను ప్రేమగా 'చింటూ అన్న' అని పిలుస్తారని చెప్పారు. ఈ సినిమా మొత్తం అఖిల్‌కు, చిత్రబృందానికి నాగవంశీ అండగా నిలిచారని, సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉందంటే ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా ఆయనే డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారని వెల్లడించారు. 'లెనిన్' రాయలసీమ మట్టి, అక్కడి మనుషుల జీవితం ఆధారంగా తెరకెక్కిన కథ అని నాగార్జున వివరించారు. సీమలో జరుగుతున్న మహాభారతంలాంటి సంఘర్షణను ఈ సినిమా ఆవిష్కరిస్తుందని అన్నారు. ఇప్పటివరకు అఖిల్ ఎక్కువగా అర్బన్ నేపథ్యంలోని సినిమాలే చేశాడని, ఈ కథ మొదలైనప్పుడు ఈ పాత్రకు అతను పూర్తిగా న్యాయం చేయగలడా అనే సందేహం తనకు కలిగిందని చెప్పారు.

Advertisement

వివరాలు 

గ్లింప్స్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన

అయితే సినిమా చూసిన తర్వాత తనతో పాటు అందరూ ఆశ్చర్యపోయారని నాగార్జున వెల్లడించారు. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత లెనిన్ పాత్రలోని స్నేహాన్ని, పగను, భావోద్వేగాలను తప్పకుండా ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జులై 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అఖిల్‌కు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, "మనవాడు కొడుతున్నాడు" అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement