Anaganaga Oka Raju Review: నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా 'అనగనగా ఒక రాజు'.. ఎంతవరకు ఆకట్టుకుంది?
ఈ వార్తాకథనం ఏంటి
చాలా ఆలోచించి సినిమాలు చేసే నటుడు నవీన్ పోలిశెట్టి, ఓ ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు. సుదీర్ఘ విరామం అనంతరం ఆయన నటించిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సినిమా ప్రకటించినప్పటి నుంచే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని అందరూ భావించారు. నిర్మాత నాగవంశీ సినిమా ప్రమోషన్‌ను మరింత స్థాయిలో నిర్వహించడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మొదట్లో వేర్వేరు దర్శకులు ఉన్నప్పటికీ, చివరికి సినిమాను పూర్తి చేసింది మారి.
వివరాలు
కథ ఏమిటంటే…
అమెరికాలో ప్రీమియర్స్‌కు కొంత పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం. జమీందారీ వంశానికి చెందిన రాజు (నవీన్ పోలిశెట్టి) కి ధనవంతుడిగా జీవించాలనే కోరిక ఎక్కువ. అయితే అతడి తాత ఆస్తులన్నీ కరిగించేయడంతో, నిజానికి డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ కాలం గడుపుతుంటాడు. తన బంధువుల్లో ఒకరు సంపన్నురాలిని పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో, రాజుకి కూడా అదే మార్గం సరైందనిపిస్తుంది. పక్క ఊరికి చెందిన కోట్లాది ఆస్తులున్న చారులత (మీనాక్షి చౌదరి) తనకు సరైన జోడీ అనుకుని ఆమెను ప్రేమలో పడేలా చేస్తాడు.
వివరాలు
విశ్లేషణ
చివరకు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి జరిగిన మొదటి రాత్రే రాజుకి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆస్తులున్న అమ్మాయిని చేసుకున్నాక తెలిసిన ఆ నిజం ఏమిటి? అసలు చారులత రాజును ఎందుకు ప్రేమించింది? చివరికి రాజు తీసుకున్న నిర్ణయం ఏమిటి? వీరిద్దరి ప్రయాణం చివరికి ఏ మలుపు తిరిగింది? మధ్యలో ఎర్రి బాబు (తారక్ పొన్నప్ప) పాత్ర ప్రాధాన్యత ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాల్సిందే. నవీన్ పోలిశెట్టి సినిమా అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటివరకు ఆయన ఎంచుకున్న కథలు అలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయి. భిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నవీన్.
వివరాలు
కొంచెం రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు..
ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని అభిమానులు భావించారు. అయితే ఈసారి మాత్రం అంచనాలను తలకిందులు చేస్తూ కొంచెం రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ పరంగా చూస్తే ఇందులో పెద్దగా కొత్తదనం లేదు. ఆస్తులు కోల్పోయిన జమీందారీ కుటుంబానికి చెందిన యువకుడు, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో మోసపోయి, చివరికి ఎలా బుద్ధి తెచ్చుకుంటాడన్నదే ప్రధాన కథాంశం. ఇలాంటి కథా రేఖతో గతంలోనూ పలు సినిమాలు వచ్చాయి. అవి కామెడీ పరంగా సక్సెస్ అయ్యాయి కూడా. కానీ ఈ సినిమా మాత్రం హ్యూమర్ విషయంలో పూర్తిస్థాయిలో వర్కవుట్ కాలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్ పరిచయం, హీరో-హీరోయిన్ ప్రేమ కథ, పెళ్లి వరకు ఆసక్తికరంగా సాగుతుంది.
వివరాలు
ఇంటర్వెల్ ముందు వచ్చే ఓ ట్విస్ట్..
ఇంటర్వెల్ ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. రెండో భాగం కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. రాజకీయ కోణాన్ని జోడించడంతో సినిమా ఒక పొలిటికల్ సెటైర్‌లా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తుంది. చివర్లో ఎప్పటిలాగే ఓ సందేశంతో సినిమాను ముగించారు. మొత్తంగా చూస్తే కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగా వర్కవుట్ అయింది, మరికొన్ని చోట్ల మాత్రం తడబడింది. పూర్తిగా నవ్వించే స్థాయిలో సినిమా టీమ్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయినప్పటికీ, నవ్వు పుట్టించిన సన్నివేశాలు మాత్రం బాగా కనెక్ట్ అవుతాయి.
వివరాలు
నటీనటుల ప్రదర్శన
నటీనటుల విషయానికి వస్తే, ఇలాంటి పాత్రలు నవీన్ పోలిశెట్టికి కొత్తేమీ కాదు. రాజు పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయాడు. తన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కొన్ని సన్నివేశాల్లో మెప్పించాడు. మీనాక్షి చౌదరి అమాయకమైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది. చమ్మక్ చంద్ర, జబర్దస్త్ మహేష్ తదితరులు తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు.
వివరాలు
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విభాగంలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్రేమింగ్, విజువల్స్ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. నిడివి విషయంలో ఇంకొంచెం కేర్ తీసుంటే బాగుండేదని అనిపిస్తుంది. సంగీతం ఓకే అనిపిస్తుంది, నేపథ్య సంగీతం సినిమాకు తగినట్టుగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే 'అనగనగా ఒక రాజు' సినిమా కొన్ని చోట్ల నవ్విస్తుంది, మరికొన్ని చోట్ల సాధారణంగా సాగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్లే ప్రేక్షకులకు అక్కడక్కడా సరదా పంచే ప్రయత్నం చేసిన సినిమా ఇది.