దేవుళ్ళ రూపాల్లో తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు దేవుడిగా మారిన ఎన్టీ రామారావు
ఎన్టీ రామారావు, ఈ పేరు చెబితే తెలుగు సినిమా పులకరించిపోతుంది, తెలుగు వాడి ఛాతి ఐదంగుళాలు పెరుగుతుంది. తెరమీద ఎన్టీఆర్ కనిపిస్తే మనసు ఉప్పొంగుతుంది. తెలుగు ప్రేక్షకులకు రాముడిగా, కృష్ణుడిగా వెండితెరమీద కనిపించిన నటుడు, ఆత్మగౌరవ నినాదంతో తెలుగు వారికి గుర్తింపును తీసుకొచ్చిన ఘనుడు ఎన్టీఆర్. 1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వెండితెర రంగప్రవేశం మనదేశం(1949) సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ కనిపించారు. ఆ తర్వాత షావుకారు, పల్లెటూరి పిల్ల(1950) సినిమాలు చేసారు. 1951లో పాతాళ భైరవి సినిమా చేసారు ఎన్టీఆర్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
శ్రీకృష్ణుడిగా 17సినిమాలు
ఎన్టీఆర్ నటించిన పౌరాణికాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన మొదటగా నటించిన పౌరాణిక చిత్రం మాయాబజార్(1958). ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా కనిపిస్తారు. మొత్తం 17సినిమాల్లో కృష్ణుడి పాత్రలో కనిపించారు ఎన్టీఆర్. అలాగే రాముడిగా, లవకుశ, శ్రీరామాంజనేయ యుద్దం ఇంకా చాలా సినిమాల్లో కనిపించారు. కర్ణుడిగా, రావణాసురుడిగా, శివుడిగా, భీష్ముడు, అర్జునుడు, ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే పౌరాణిక పాత్రలు చాలానే ఉన్నాయి. ఆయన నటించిన చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు, 1993లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు సినిమాకు, తెలుగు ప్రజలకు విశేష కృషి చేసిన ఎన్టీ రామారావు, 1996లో జనవరి 18వ తేదీన 72ఏళ్ళ వయసులో పరమపదించారు.