
OG : ఓజీ ప్రీ రిలీజ్ ఫెస్టివల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'ఓజీ'. 'రన్ రాజా రన్', 'సాహో' వంటి చిత్రాలతో తన ప్రత్యేకమైన శైలి చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ ఓజాస్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పవన్ జన్మదినం సందర్భంగా విడుదలైన 'ఓజీ' గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. చిన్న సినిమాలు హిట్‌లు సాధిస్తున్నా, పెద్ద సినిమాలు రాణించడం లేదు. ఈసమయంలో 'ఓజీ' మాత్రం ఆ ట్రెండ్‌ను చెరిపేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి.
Details
చిరంజీవి హజరయ్యే అవకాశం
ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ వేడెక్కుతున్నాయి. రిలీజ్‌కు ఇంకా 18 రోజులు మిగిలి ఉండగానే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం, కేవలం నార్త్ అమెరికా నుంచే 12 లక్షల డాలర్ల గ్రాస్ వసూలు కావడం ఈ సినిమాకు ఉన్న అతి పెద్ద క్రేజ్‌ను రుజువు చేస్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో ఈవెంట్స్ జరగనున్నాయని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, పవన్-చిరంజీవి ఒకే వేదికపై కలవడం మెగా అభిమానులకు పండగే కాకుండా లైఫ్‌టైమ్ మెమరీగా మిగిలిపోనుంది.