Loading...
RamBola Title War: ఒకే బయోపిక్‌.. ఒకే టైటిల్‌.. 'రామ్ బోలా'పై ఇద్దరు దర్శకుల పోటీ!
ఒకే బయోపిక్‌.. ఒకే టైటిల్‌.. 'రామ్ బోలా'పై ఇద్దరు దర్శకుల పోటీ!

RamBola Title War: ఒకే బయోపిక్‌.. ఒకే టైటిల్‌.. 'రామ్ బోలా'పై ఇద్దరు దర్శకుల పోటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

వినాయక చవితి సందర్భంగా బాలీవుడ్‌లో ఓ సినిమా ప్రకటన వెలువడింది. అయితే ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే అదే టైటిల్‌తో మరో సినిమా ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఊహించని వివాదం మొదలైంది. ఇద్దరు దర్శకులు ఒకే బయోపిక్‌ను ప్రకటించడమే కాకుండా.. ఇద్దరూ ఒకే టైటిల్‌ను ఎంచుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఇది సాధారణ వ్యక్తి జీవిత కథ కాదు. రామచరితమానస్, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక సాహిత్యంతో గుర్తింపు పొందిన మహాకవి గోస్వామి తులసీదాస్ జీవిత కథ కావడం విశేషం. 'హనుమాన్ అంశ్'తో ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విశాల్ చతుర్వేది.. తన తదుపరి సినిమాను సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా ప్రకటించారు.

వివరాలు

అదే పేరుతో రూపొందించాలని ప్లాన్

మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి 'రామ్ బోలా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గోస్వామి తులసీదాస్ జీవితాన్ని, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాకు విశాల్ చతుర్వేది కథ, దర్శకత్వంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. మహావీర్ జైన్, విశాల్ చతుర్వేది, అమిత్ ఉపాధ్యాయ్, రఘువేంద్ర సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే మరో 'రామ్ బోలా' సినిమా కూడా వార్తల్లోకి వచ్చింది.

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది కూడా గోస్వామి తులసీదాస్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇదే పేరుతో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.

వివరాలు

టైటిల్‌పై చంద్రప్రకాశ్ ద్వివేది అభ్యంతరం

దీంతో ఒకే కథ ఆధారంగా రెండు సినిమాలు ఎలా వచ్చాయి? ఇద్దరు మేకర్స్ ఒకే టైటిల్‌ను ఎలా ప్రకటించారు? అనే చర్చ మొదలైంది.

ఇదే టైటిల్ విషయంలో డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన 'రామ్ బోలా' టైటిల్‌ను ఇప్పటికే ముందుగానే రిజిస్టర్ చేసినట్లు ఆయన చెబుతున్నట్లు సమాచారం.

అంతేకాదు.. తులసీదాస్ కథకు సంబంధించిన సమాచారాన్ని గతంలోనే మహావీర్ జైన్‌కు పంపినట్లు కూడా ఆయన పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదే పేరుతో మరో సినిమాను ప్రకటించడంపై ద్వివేది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఒకే టైటిల్‌తో రెండు ప్రాజెక్టులు తెరపైకి రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

IMPPA వద్దకు చేరిన వివాదం

ఒకే పేరుతో ఇద్దరు టాప్ మేకర్స్ పోటీ పడుతుండటంతో ఈ వివాదం ప్రస్తుతం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

రెండు ప్రాజెక్టులకు సంబంధించిన టైటిల్ రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాతే అసోసియేషన్ తుది నిర్ణయం తీసుకోనుంది.

ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చే క్లియరెన్స్ ఆధారంగానే.. 'రామ్ బోలా' టైటిల్‌తో ఎవరి సినిమా ముందుకు వెళ్తుందనేది తేలనుంది.

దీంతో ప్రస్తుతం 'రామ్ బోలా' టైటిల్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT