ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు
అమెరికాలో అవార్డ్స్ సీజన్ మొదలైనప్పటి నుండి ఆర్ఆర్ఆర్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని, కొన్నింటికి నామినేట్ అయ్యి, మరికొన్నింటి నామినేషన్ కోసం ఎదురుచూస్తుంది ఆర్ఆర్ఆర్. తాజాగా ఆస్కార్ కి అర్హత సాధించిన సినిమాల లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో ఆర్ఆర్ఆర్ తో పాటు భారతదేశం నుండి మరో మూడు సినిమాలు ఉన్నాయి. కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా ఈ రిమైండర్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అలాగే బాలీవుడ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్, ఆలియాభట్ గంగుభాయి కఠియా వాడి సినిమాకు కూడా ఇందులో స్థానం దక్కింది. దీంతో సినిమా అభిమానులు అందరూ హ్యాపీగా ఉన్నారు.
మొత్తం 301 సినిమాలు
ఈ రిమైండర్ లిస్ట్ లో 301 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నింటికీ ఓటింగ్స్ జరుగుతాయి. జనవరి 12వ తేదీ నుండి జనవరి 17వ తేదీ వరకు ఓటింగ్స్ జరగనున్నాయని, జనవరి 24వ తేదీన నామినేట్ అయిన సినిమాల జాబితాను ప్రకటిస్తామని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తెలియజేసింది. ఆస్కార్ రిమైండర్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న విషయాన్ని వెల్లడి చేసిన అగ్నిహోత్రి, ఇది ప్రారంభం మాత్రమే అని, ఇంకా చాలా దూరం వెళ్లాలని ట్వీట్ చేసారు. కాంతారా సినిమా హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ, కాంతారా సినిమాను ఇక్కడిదాకా తీసుకొచ్చినందుకు అందరికీ దన్యవాదాలు తెలియజేసాడు. ఆస్కార్ అవార్డుల ప్రకటన మార్చ్ 12వ తేదీన ఉండనుంది.