'Pallaburusu' Trailer: 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్.. టూత్ బ్రష్‌తో మొదలైన తండ్రి-కొడుకుల ఎమోషనల్ కథ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మరో ఆసక్తికర చిత్రం 'పళ్లబురుసు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కాలంలో తెలంగాణ సంస్కృతి, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సినిమాలు వరుసగా వస్తుండగా.. అదే కోవలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను హీరో నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. 'బలగం' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసి కథపై ఆసక్తిని పెంచింది. ట్రైలర్ ప్రకారం.. ఒక వృద్ధుడు తన కొడుకు తనకు టూత్ బ్రష్ కొనివ్వలేదనే కారణంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తాడు.
వివరాలు
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మూవీ
ఈ చిన్న సంఘటనతో ప్రారంభమైన వివాదం కుటుంబంలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ఒక సాధారణ 'పళ్లబురుసు' తండ్రి-కొడుకుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? అనే అంశాలను భావోద్వేగంగా చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే తండ్రి-కొడుకుల అనుబంధం, కుటుంబ విలువలు, కోర్టు చుట్టూ తిరిగే ఆసక్తికరమైన డ్రామాతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసే కథను దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మొత్తంగా చూస్తే.. 'పళ్లబురుసు' ఓ చిన్న సంఘటన చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.