Pankaj Udhas: భారత గజల్ ఐకాన్, దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత
Pankaj Udhas Passes Away: లెజెండరీ సింగర్, భారత గజల్ ఐకాన్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. దీంతో హిందీ సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో ముగిపోయింది. కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పంకజ్ ఉధాస్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి 11 గంటలకు ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ ఉధాస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతను గత కొన్ని నెలలుగా ఎవరినీ కలవడం లేదు. మంగళవారం ముంబైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సంజయ్ దత్ చిత్రం 'నామ్'తో పాపులారిటీ
పంకజ్ ఉధాస్ 1951 మే 17న గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో జన్మించారు. అతను 1980లో 'ఆహత్' అనే గజల్ ఆల్బమ్‌ను విడుదల చేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనతి కాలంలో పంకజ్ ఉధాస్ గజల్ సంగీతానికి పర్యాయపదంగా, ఇండియన్ గజల్ ఐకాన్‌గా మారారు. బాలీవుడ్‌లో సంజయ్ దత్ చిత్రం 'నామ్' కోసం 'చితి ఆయీ హై' అనే ఐకానిక్ ట్రాక్ పాడటం ద్వారా చాలా పాపులర్ అయ్యారు. పంకజ్ అనేక ఆల్బమ్‌లను విడుదలై సూపర్ సక్సెస్ అయ్యాయి. తన కెరీర్‌లో పంకజ్ అనేక సంగీత కచేరీలను నిర్వహించారు. సంగీత కచేరీలకు విశేష జనాధారణ ఉండేది. పంకజ్ ఉధాస్‌కు భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సైతం లభించింది.