LOADING...
Bandla Ganesh: 15 ఏళ్లు నొప్పిని భరించిన పవన్‌.. బండ్ల గణేశ్‌ భావోద్వేగ పోస్ట్
నిర్మాత కోసం 15 ఏళ్ల నరకాన్ని భరించిన పవన్: బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్

Bandla Ganesh: 15 ఏళ్లు నొప్పిని భరించిన పవన్‌.. బండ్ల గణేశ్‌ భావోద్వేగ పోస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

15 ఏళ్లుగా తీవ్ర నొప్పిని భరిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ భావోద్వేగంగా స్పందించారు. పవన్‌కు భుజాలకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో రొటేటర్‌ కఫ్‌తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బండ్ల గణేశ్‌ సోషల్ మీడియాలో స్పందిస్తూ, పవన్‌ కల్యాణ్‌ ఇంతకాలం ఆ బాధను ఎలా భరించారో తలచుకుంటే తన హృదయం భారంగా మారిందని పేర్కొన్నారు.

వివరాలు 

పవన్‌ తీసుకున్న నిర్ణయం సాధారణ హీరో తీసుకునేది కాదు: గణేష్ 

తన పోస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. "15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంతటి కష్టాన్ని అనుభవించారో ఇప్పుడు ఆలోచిస్తే నా మనసు కలిచివేస్తోంది. 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ రోజులు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతున్నాయి. గుజరాత్‌లో గుర్రం మీద నుంచి పడిపోయిన ఘటన, వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది" అని తెలిపారు. ఆ సమయంలో పవన్‌ తీసుకున్న నిర్ణయం సాధారణ హీరో తీసుకునేదిగా కాదని, మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకుంటారని బండ్ల గణేశ్‌ అన్నారు.

వివరాలు 

ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను: బండ్ల గణేష్ 

"ముందుగా సినిమా పూర్తి చేయాలి. నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. వందలాది మంది ఈ సినిమా కోసం శ్రమిస్తున్నారు" అనే ఆలోచనతో పవన్‌ శస్త్రచికిత్సను వాయిదా వేసి, షూటింగ్ పూర్తిచేసి, సినిమా విడుదలయ్యే వరకు తమకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఒక నిర్మాతగా తనకు పవన్‌ ఇచ్చింది కేవలం విజయవంతమైన సినిమా మాత్రమే కాదని, జీవితాంతం మరచిపోలేని ఋణమని ఆయన పేర్కొన్నారు. "ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను. ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి వింటుంటే నా హృదయం ముక్కలవుతోంది" అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: గణేష్ 

చివరగా పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని బండ్ల గణేశ్‌ తెలిపారు. "మీరు ఇన్నేళ్లు అనుభవించిన నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు వెండితెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా ఎందరో జీవితాలకు అండగా నిలిచిన నిజమైన హీరో" అని తన పోస్ట్‌ను ముగించారు.

Advertisement