అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే
ప్రభాస్.. ఈ ఒక్క పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు బాలీవుడ్ సైతం ప్రభాస్ నిర్ణయాలకు బెంబేలెత్తిపోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం జూన్ నుంచి వరుస పెట్టి సినిమాలను తీసుకొస్తున్నాడు ప్రభాస్. జూన్ 16వ తేదీన ఆది పురుష్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత సెప్టెంబర్ 28వ తేదీన ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరో మూడు నెలల తర్వాత 2024 జనవరి 12వ తేదీన దర్శకుడు నాగ్ అశ్విన్ కలల ప్రాజెక్టు, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్టు కె విడుదలవుతుంది. కేవలం ఆరు నెలల్లోనే మూడు సినిమాల విడుదల తేదీలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అందరి దారి అటు, ప్రభాస్ మాత్రం ఇటు
ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో కూడా వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసింది లేదు. మహా అయితే సంవత్సరం మొదట్లో ఒకటి, సంవత్సరం చివరిలో ఒకటి మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడైతే చాలామంది పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమాను మాత్రమే తీసుకొస్తున్నారు. కానీ వాటికి విరుద్ధంగా మూడు సినిమాలను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఈ మూడు సినిమాల బడ్జెట్ లు కూడా చాలా పెద్దవి కావడం విశేషం. ఆది పురుష్, ప్రాజెక్ట్ కె.. 500 కోట్లకు పైగా బడ్జెట్లతో తెరకెక్కుతున్నాయి. అంటే 6నెలల్లో వెయ్యికోట్లకు పైగా బిజినెస్ చేయాలన్న మాట. మరి ఈ ఫీట్ ప్రభాస్ సాధిస్తాడో లేదో చూడాలి.