ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
బాహుబలి స్టార్ ప్రభాస్, నటిస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించేసింది. దీంతో సంక్రాంతి బరిలో ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మిగతా సినిమాలకు గట్టి పోటీగా నిలిచింది. నిజానికి ప్రాజెక్ట్ కె మూవీ, 2024వేసవిలో విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం జూన్ 16వ ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. అలాగే సలార్, సెప్టెంబర్ 28వ తేదీన విడుదలవుతుంది. ఈ సంవత్సరమే రెండు సినిమాలు రిలీజవుతున్నాయి కాబట్టి ప్రాజెక్ట్ కె 2024వేసవిలోకి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సంక్రాంతి బరిలో నిలవడంతో, సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.
సంక్రాంతి బరిలో నిలిచే దిశగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ సినిమాలు
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని సంక్రాంతి తీసుకొద్దామని అనుకుంటున్నారు. ఈ సినిమాలో బందిపోటు దొంగగా పవన్ కనిపిస్తున్నారు. రామ్ చరణ్ 15వ సినిమాను కూడా సంక్రాంతి రేసులో నిలబెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. అటు కమల్ హాసన్ తో ఇండియన్ 2, ఇటు రామ్ చరణ్ తో 15వ సినిమాను చేస్తున్న శంకర్, ఎప్పటిలోగా షూటింగ్ పూర్తి చేస్తాడో తెలియదు. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మహేష్ 28వ మూవీ షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమైంది. ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ కుదరకపోతే సంక్రాంతికి చేయాలని అనుకుంటున్నారట. మరి ఇన్ని సినిమాల మధ్య ఏ సినిమాలు సంక్రాంతి వస్తాయో చూడాలి.