పవర్ స్టార్ కోసం పాట పూర్తి చేసిన రాక్ స్టార్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గతకొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ దూరమైపోయాడు. అప్పట్లో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాలతో దుమ్ము దులిపేసాడు. జల్సా పాటలు అప్పట్లో ఒక సంచలనంగా మారాయి. ఇప్పటికీ కూడా ఆ పాటల జోరు అలాగే ఉంది. ఐతే అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పనిచేయలేదు. దానికి సరైన కారణాలు ఏంటనేది తెలియదు గానీ, ఆ మధ్య దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అంతగా పేలలేదు. కానీ పుష్ప సినిమాతో సంగీత సునామీ సృష్టించాడు దేవి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతోనూ మంచి హిట్ అందుకున్నాడు. దాంతో పవన్ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం దేవికి వచ్చిందని తెలుస్తోంది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. హరిహరవీరమల్లు సినిమాకు కీరవాణి వాయిస్తున్నాడు. ఇక సుజిత్ దర్శకత్వంలోని ఓజీ మూవీకి థమన్ అని చెప్పుకుంటున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకున్నారని, ఆల్రెడీ ఒక పాట కంపోజింగ్ అయిపోయిందని, ఆ పాట పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందని, అభిమానులకు కూడా తెగ నచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఆ పాట వివరాలు, మ్యూజిక్ డైరెక్టర్ వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీనె యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.