అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ టాక్ షోలోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు మొదటి భాగం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయ్యింది.
మొదటి భాగంలో ఎక్కువ శాతం సినిమాకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. రాజకీయ అంశాల గురించి రెండో భాగంలో ఉంటుందని అందరూ అనుకున్నారు. తాజాగా రెండవ భాగం ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది.
అనుకున్నట్లుగానే ఈ ప్రోమో మొత్తం రాజకీయ అంశాలే ఉన్నాయి. అవి కూడా సూటి ప్రశ్నలే. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందెప్పుడూ సమాధానం ఇవ్వనటువంటి ప్రశ్నలు ఇందులో కనిపించాయి.
రాజకీయ పార్టీ ప్రారంభించాలని ఎందుకు అనిపించిందనే ప్రశ్న దగ్గరి నుండి తెలుగుదేశంలో జాయిన్ అవ్వొచ్చు కదా అని కూడా పవన్ ని ప్రశ్నించారు బాలకృష్ణ.
పవన్ కళ్యాణ్
అభిమానులు ఓటర్లుగా ఎందుకు మారలేకపోయారన్న బాలకృష్ణ
ప్రోమో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ప్రోమోలో కొన్ని సున్నితమైన ప్రశ్నలు కూడా బాలకృష్ణ అడిగారు. ఎంతో మంది అభిమానులున్నా కూడా ఆ అభిమానులను ఓటర్లుగా ఎందుకు మారలేదని పవన్ ని అడిగారు.
అలాగే జనసేన మ్యానిఫేస్టో జనాల్లోకి వెళ్ళకపోవడం వల్లే ఓట్లు ఎక్కువ రాలేదేమో అనే సందేహాన్ని వెలిబుచ్చారు బాలకృష్ణ. ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్పనున్నారనేది ఎపిసోడ్ విడుదలైతేనే తెలుస్తుంది.
ఏది ఏమైనా అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం కంటే రెండవ భాగం ఎక్కువ ఆసక్తిని పెంచుతోంది. ఈ ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో ఎన్నో చర్చలకు దారితీసేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన రెండవ భాగం విడుదల కానుంది.