LOADING...
Naga Vamsi: 'పెద్ది' విడుదల వల్లే 'బ్లాస్ట్‌ జోన్‌'ను ప్రమోట్‌ చేయలేకపోయా: నాగవంశీ
'పెద్ది' విడుదల వల్లే 'బ్లాస్ట్‌ జోన్‌'ను ప్రమోట్‌ చేయలేకపోయా: నాగవంశీ

Naga Vamsi: 'పెద్ది' విడుదల వల్లే 'బ్లాస్ట్‌ జోన్‌'ను ప్రమోట్‌ చేయలేకపోయా: నాగవంశీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, మంచి కథా కంటెంట్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని చిత్రాలకు సరైన స్థాయిలో ప్రచారం దక్కకపోవడంతో మరింత పెద్ద విజయాన్ని అందుకోలేకపోయాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతుంటారు. అలాంటి చిత్రాల్లో ఇటీవల విడుదలైన 'బ్లాస్ట్‌ జోన్‌' ఒకటి. అర్జున్‌, ప్రీతి ముకుందన్‌, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంది. తెలుగులో ఈ సినిమాను నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. తన తాజా చిత్రం 'లెనిన్‌' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో నాగవంశీ 'బ్లాస్ట్‌ జోన్‌'కు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయిన కారణాన్ని వెల్లడించారు.

వివరాలు 

'పెద్ది' నిర్మాత సతీశ్‌ కిలారు నాకు మంచి స్నేహితుడు

ఆయన మాట్లాడుతూ..'బ్లాస్ట్‌ జోన్‌'కు ప్రత్యేకంగా ప్రమోషన్‌ చేసే అవకాశం రాలేదు. అదే సమయంలో 'పెద్ది' విడుదలైంది.ఆ సమయంలో నేను 'బ్లాస్ట్‌ జోన్‌'ను ప్రచారం చేసి ఉంటే,కావాలనే 'పెద్ది'కి పోటీగా వ్యవహరించానని భావించే అవకాశం ఉండేది.మరోవైపు'పెద్ది' విడుదలైన తర్వాత ప్రచారం మొదలుపెడితే,సినిమా కలెక్షన్లను దెబ్బతీయడానికే ఇప్పుడు ప్రచారం చేస్తున్నావా అని విమర్శించేవారు.పైగా 'పెద్ది' నిర్మాత సతీశ్‌ కిలారు నాకు మంచి స్నేహితుడు.ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తొలి సినిమా కావడంతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది.'బ్లాస్ట్‌ జోన్‌' రెండు వారాల ముందే విడుదలై ఉండి ఉంటే,మరింత మెరుగైన వసూళ్లు సాధించేదేమో. అయినప్పటికీ థియేటర్లలో మంచి ఆదరణ లభించింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది" అని చెప్పారు.

వివరాలు 

రామ్‌ చరణ్‌తో సినిమా

రామ్‌ చరణ్‌తో సినిమా చేయాలనే ప్రయత్నం కూడా చాలాకాలంగా కొనసాగుతోందని నాగవంశీ తెలిపారు. అయితే వివిధ కారణాలతో ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడానికి టికెట్‌ ధరలు ప్రధాన కారణం కాదని నాగవంశీ అభిప్రాయపడ్డారు. టికెట్‌ కంటే థియేటర్లలో పాప్‌కార్న్‌ వంటి ఆహార పదార్థాల అధిక ధరలే ప్రేక్షకులను వెనక్కి నెడుతున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

సిద్ధు జొన్నలగడ్డతో ఓ రూరల్‌ కామెడీ చిత్రం 

ప్రస్తుతం ప్రేక్షకులు రివ్యూలు, రేటింగ్‌ల కంటే మౌత్‌ టాక్‌ను ఎక్కువగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు. దీనికి 'మా ఇంటి బంగారం' సినిమానే మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు కూడా ప్రతి ఏడాది కనీసం ఒక వినోదాత్మక చిత్రం చేయాలని నాగవంశీ సూచించారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డతో ఓ రూరల్‌ కామెడీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో హీరో పాత్రకు ఓ ప్రత్యేకమైన సూపర్‌నేచురల్‌ శక్తి ఉంటుందని ఆయన ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

Advertisement