Raghava Lawrence: ప్రజల మద్దతే కీలకం.. రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయమై ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని కోరుతూ ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజల మద్దతు లభిస్తే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని, లేకపోతే ఆ ఆలోచనను విరమించుకుంటానని స్పష్టం చేశారు. రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే లారెన్స్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించారు. తాను ఫలితాలను ఆశించకుండా నిజాయతీగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని నమ్ముతానని పేర్కొన్న లారెన్స్, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదన్నారు.
వివరాలు
సంపాదన కోసం రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు
అధికార పదవి కోసం గానీ, డబ్బు సంపాదన కోసం గానీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. నాకు అత్యంత సన్నిహితులైన వారు రాజకీయాల్లోకి వస్తే, వారి పక్కన నిలబడి ప్రస్తుతం చేస్తున్న సేవల కంటే మరింత ఎక్కువగా సమాజానికి సేవ చేయాలని అనుకున్నాను. అయితే కొన్ని పరిస్థితులు, జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను కలిగించాయని ఆయన తన పోస్టులో వెల్లడించారు. అనంతరం విడుదల చేసిన వీడియోలో తన రాజకీయ నిర్ణయానికి తల్లి కూడా అంగీకరించినట్లు తెలిపారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన కొన్ని సంఘటనలను పంచుకున్న లారెన్స్, వాటి నుంచే రాజకీయాలపై స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. నా నిర్ణయం సరైందో కాదో మీరు చెప్పాలి.
వివరాలు
టీవీకేలో చేరే అవకాశం
మీరు అంగీకరిస్తే మీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెడతాను. ఎప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తానో, ఏ రాజకీయ పార్టీలో చేరుతానో తగిన సమయంలో ప్రకటిస్తాను. ఒకవేళ మీరు వద్దని చెబితే ఈ ఆలోచనను విరమించుకుని, ఇప్పటిలాగే సమాజ సేవను నిస్వార్థంగా కొనసాగిస్తానని లారెన్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో రాఘవ లారెన్స్ బరిలోకి దిగే అవకాశాలపై ప్రచారం సాగుతోంది.