Raadhika Sarathkumar: టాలీవుడ్ హీరోల్లో అతడే నా ఫేవరెట్.. రాధిక శరత్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన 'తాయ్ కిళవి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ హీరోలు, సినీ పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను తల్లి పాత్రలు చేయాలనే ఆసక్తిలో లేనని చెప్పిన రాధిక.. ముఖ్యంగా చిరంజీవికి తల్లి పాత్ర చేయమని ఎవరైనా అడిగితే సరదాగా "కాళ్లు విరగ్గొడతా" అంటూ నవ్వేశారు. తమ వయస్సు నటీమణుల కోసం ఇప్పుడు దర్శకులు కొత్త తరహా పాత్రలు రాస్తున్నారని, గతంలో మాత్రం ఎక్కువగా బాధతో నిండిన తల్లి పాత్రలకే పరిమితం చేసేవారని పేర్కొన్నారు.
వివరాలు
ఆ హీరోలు చిన్నప్పుడు ఎలా ఉండేవారంటే..
ఇక విలన్ పాత్రలు చేయడానికీ తాను సిద్ధమేనని, శంకర్ తెరకెక్కించిన 'జీన్స్' సినిమాలో అలాంటి ఛాయలున్న పాత్రలో నటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు హీరోల గురించి మాట్లాడిన ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాదు, తన మనవడికి కూడా 'తారక్' అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల ఎదుగుదలను చూస్తూ వచ్చానని, వారు సాధించిన స్థాయిని చూసి ఎంతో గర్వంగా అనిపిస్తుందని అన్నారు. మహేశ్ బాబును చిన్నతనంలో కృష్ణ సినిమా షూటింగ్ సమయంలో అమాయకమైన చాక్లెట్ బాయ్‌లా చూసానని, ఇప్పుడు ఆయన స్టార్‌డమ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
వివరాలు
తమిళంలో అజిత్, విజయ్ తర్వాత ఎవరూ లేరు..
తమిళ సినీ పరిశ్రమతో పోలిస్తే తెలుగులో హీరోల మధ్య ఎక్కువ వైవిధ్యం కనిపిస్తోందని రాధిక అభిప్రాయపడ్డారు. తమిళంలో అజిత్, విజయ్ తర్వాత అంతగా యువ హీరోలు కనిపించడం లేదని పేర్కొన్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాల విజయాలపై ఆనందం వ్యక్తం చేస్తూ.. గతంలో భాషల మధ్య ఉన్న గోడలు ఇప్పుడు కూలిపోయాయని, ప్రేక్షకులు ప్రతిభను భాషకు అతీతంగా ఆదరిస్తున్నారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తాను 'వయ్యారి భామలు వగలమారి భర్తలు' అనే ఒక్క సినిమానే చేశానని, అదే ఆయన చివరి సినిమా కావడం ప్రత్యేకంగా గుర్తుండిపోయిందని అన్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు పాటల చిత్రీకరణకు ముందు భోజనం చేయకుండా, తేలికగా ఉండేందుకు టీ, బిస్కెట్లు మాత్రమే తీసుకునేవారని గుర్తుచేశారు.