LOADING...
Raghava Lawrence: రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్‌? తిరుచ్చి ఈస్ట్‌ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన నటుడు!
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్‌? తిరుచ్చి ఈస్ట్‌ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన నటుడు!

Raghava Lawrence: రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్‌? తిరుచ్చి ఈస్ట్‌ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన నటుడు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వార్తలు రావడంతో తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా లారెన్స్ స్పందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో రెండింటిలోనూ విజయం సాధించారు. అనంతరం పెరంబూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని ఖాళీ చేశారు. దీంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.

వివరాలు

బెంజ్' సినిమా షూటింగ్‌లో బిజీ

ఈ ఉప ఎన్నికలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందిస్తూ లారెన్స్ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. "తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయబోతున్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని పలువురు మీడియా మిత్రులు ఫోన్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను 'బెంజ్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీతో ఆ షెడ్యూల్ పూర్తవుతుంది. మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురువారం ఉదయం 9:30గంటలకు ప్రకటిస్తానని లారెన్స్ తన పోస్టులో పేర్కొన్నారు.

వివరాలు

గురువారం కీలక ప్రకటన

సినిమాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ రాఘవ లారెన్స్ చురుగ్గా పాల్గొంటుంటారు. తన తల్లి పేరుతో అనాథలు, వృద్ధులకు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సహాయం కోసం తనను ఆశ్రయించే వారిని నిరాశపరచకుండా ఆదుకుంటారనే పేరు ఆయనకు ఉంది. అంతేకాదు, సామాజిక మాధ్యమాల ద్వారా సహాయం కోరిన వారిని తన బృందం, స్నేహితుల సహకారంతో గుర్తించి మరీ సహాయం అందించే సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ప్రజల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున రాఘవ లారెన్స్ ఏ ప్రకటన చేయబోతున్నారనే ఉత్కంఠ అభిమానులు, రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Advertisement