Loading...
Varanasi: 'వారణాసి' చిత్రానికి మళ్లీ లీకుల షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా యాక్షన్ వీడియో!
'వారణాసి' చిత్రానికి మళ్లీ లీకుల షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా యాక్షన్ వీడియో!

Varanasi: 'వారణాసి' చిత్రానికి మళ్లీ లీకుల షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా యాక్షన్ వీడియో!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న 'వారణాసి' చిత్రానికి మరోసారి లీకుల సమస్య ఎదురైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక యాక్షన్ సన్నివేశం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అభిమానులు, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మహేశ్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 8)కు కొద్ది రోజుల ముందు ఈ వీడియో బయటకు రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారణాసి ఘాట్లలో చిత్రీకరించినట్లు కనిపిస్తున్న ఈ వీడియోలో మహేశ్ బాబు రక్తపు గాయాలతో కనిపిస్తుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు యాక్షన్ విజువల్స్‌పై అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు సినిమా చిత్రీకరణలో భద్రతా లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

వివరాలు

భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం..

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజంగా 'వారణాసి' చిత్రానిదేనా? లేక కృత్రిమంగా రూపొందించిన క్లిప్‌నా? అనే విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ ప్రాజెక్టుకు లీకులు కొత్త విషయం కాదు. గతంలో సినిమా సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు, కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్, అలాగే అధికారికంగా విడుదలకు ముందే అనౌన్స్‌మెంట్ మెటీరియల్‌లోని కొన్ని భాగాలు కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

తాజాగా మరో వీడియో బయటకు రావడంతో చిత్రబృందం భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని అభిమానులు సూచిస్తున్నారు.

వివరాలు

వారి కాంబోలో తొలి చిత్రం..

మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాగే అడ్వెంచర్ కథగా తెరకెక్కుతోంది.

ఇందులో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పవిత్ర క్షేత్రమైన కాశీ నుంచి ప్రారంభమయ్యే ఈ కథ టైమ్ ట్రావెల్ అంశంతో అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వంటి పలు ప్రాంతాల వరకు విస్తరించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు.

సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.

దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తవగా, ప్రధాన యాక్షన్ ఎపిసోడ్లను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

షూటింగ్‌తో పాటు పోస్ట్-ప్రొడక్షన్ పనులను సమాంతరంగా కొనసాగిస్తూ, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసే లక్ష్యంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు.

ADVERTISEMENT