Raksha Bandhan 2026: రాఖీ స్పెషల్.. టాలీవుడ్‌లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
అమ్మానాన్నల తర్వాత అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములే పెద్ద అండగా నిలుస్తారు. ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయతను మరింత బలపరిచే పండుగే రాఖీ పౌర్ణమి. భారతీయులు ఎంతో ప్రేమగా జరుపుకునే ఈ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు తమ తోబుట్టువులను కలిసి రాఖీ కట్టి సంతోషంగా గడుపుతారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు నచ్చిన బహుమతులు అందిస్తారు. ఈ రాఖీ పౌర్ణమికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమాలు మీకు మంచి ఎమోషనల్ ట్రీట్ ఇస్తాయి.
వివరాలు
చిరంజీవి - 'హిట్లర్'
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్‌హిట్ చిత్రాల్లో 'హిట్లర్' ఒకటి. ఇందులో తన చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకునే అన్నయ్యగా చిరంజీవి కనిపిస్తారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని దర్శకుడు ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాను చూసేందుకు అప్పట్లో మహిళలు ఎడ్లబండ్లలో సైతం థియేటర్లకు వెళ్లేవారని చెబుతారు.
అందుకే రాఖీ రోజు తప్పక చూడాల్సిన సిస్టర్ సెంటిమెంట్ సినిమాల జాబితాలో 'హిట్లర్'కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
వివరాలు
అర్జున్ - 'పుట్టింటికి రా చెల్లి'
యాక్షన్ హీరో అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ 'పుట్టింటికి రా చెల్లి'.
అన్నాచెల్లెళ్ల బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
వివరాలు
శ్రీహరి - 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'
శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చెల్లెలికి అన్నగా, తండ్రిగా అన్ని తానై అండగా నిలిచే పాత్రలో శ్రీహరి నటించారు.
చెల్లెలి జీవితంలోకి సిద్ధార్థ్ వచ్చిన తర్వాత అన్నగా శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరికి వారిద్దరి పెళ్లికి అంగీకరించాడా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
వివరాలు
రాజశేఖర్ - 'గోరింటాకు'
యాక్షన్ కింగ్ రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్లుగా నటించిన హిట్ మూవీ 'గోరింటాకు'.
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధాన్ని ఎంతో హృద్యంగా చూపించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
ఈ సినిమాను చూసి మహిళలు కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ల నుంచి బయటకు రాలేదంటే.. ప్రేక్షకులపై ఈ చిత్రం ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం 'గోరింటాకు' జీ5తో పాటు యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.
వివరాలు
ఎన్టీఆర్ - 'రాఖీ'
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాఖీ'. ఇందులో మంజుల ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించారు.
తన చెల్లికి ఎలాంటి చిన్న కష్టం వచ్చినా అండగా నిలిచే అన్నయ్యగా తారక్ నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సిస్టర్ సెంటిమెంట్‌ను బలంగా చూపిస్తుంది. 'రాఖీ' సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
వివరాలు
పవన్ కల్యాణ్ - 'అన్నవరం'
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సంధ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అన్నవరం'. తమిళంలో విజయం సాధించిన 'తిరుప్పాచ్చి'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది.
చెల్లెలిపై అన్నయ్యకు ఉండే ప్రేమ, ఆమె కోసం ఎంత దూరమైనా వెళ్లే అన్న పాత్ర ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. 'అన్నవరం' కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
వివరాలు
ఇవే కాదు.. మరెన్నో!
సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. మహేశ్‌బాబు నటించిన 'అర్జున్', జగపతిబాబు 'శివరామరాజు', 'చెల్లెలి కాపురం', 'పల్నాటి పౌరుషం', 'రక్త సంబంధం', 'బంగారు గాజులు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి', 'బ్రూస్‌లీ', 'కత్తి', 'హనుమాన్', 'వీరసింహారెడ్డి', 'భోళాశంకర్', 'బ్రో', 'పెద్దన్న' వంటి చిత్రాల్లోనూ అన్నాచెల్లెళ్ల అనుబంధం, సిస్టర్ సెంటిమెంట్ కనిపిస్తుంది.
ఈ రాఖీ పౌర్ణమికి మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని కుటుంబంతో కలిసి మరోసారి చూసి.. అన్నాచెల్లెళ్ల అనుబంధంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి!