గేమ్ ఛేంజర్ కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్: షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడంటే?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే తన ఈ చిత్ర షూటింగ్, గత కొన్నిరోజులుగా జరగట్లేదు. ప్రస్తుతం కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న రామ్ చరణ్, మరికొన్ని రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. పాప పుట్టాక ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా గేమ్ ఛేంజర్ కోసం తొందరగా రెడీ అవుతున్నాడని అంటున్నారు. జులైలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలుకాబోతుందని, అందులో రామ్ చరణ్ జాయిన్ అవబోతున్నాడని వినిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ తర్వాతి సినిమాకు గ్యాప్
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మొదలయ్యే మరో సినిమాకు ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోవాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్, కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. చెన్నైలో జరుగుతున్న షెడ్యూల్ పూర్తికాగానే గేమ్ ఛేంజర్ మీదకు శంకర్ షిఫ్ట్ అవుతారని అంటున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. అన్నీ సరిగ్గా కుదిరితే 2024 సంక్రాంతిని సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లేదంటే 2024వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.