Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి.. ఎమోషన్స్‌తో కట్టిపడేసిన స్పోర్ట్స్ డ్రామా
ఈ వార్తాకథనం ఏంటి
పెద్ద ఎత్తున అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించారు. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న రిలీజ్ అవుతుండగా ముందు రోజే రాత్రి ప్రీమియర్స్ వేశారు.
వివరాలు
కథ ఏంటంటే..
1990ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. విజయనగరం సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో పెద్ది (రామ్ చరణ్) తన గ్రామస్థులతో కలిసి జీవిస్తుంటాడు. ఆ గ్రామానికి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. జనాభా లెక్కల్లో కూడా వారి పేర్లు ఉండవు. జీవనోపాధి కోసం ప్రతిరోజూ కొండలు, అడవులు దాటి విజయనగరంలోని బెల్లం ఫ్యాక్టరీలకు వెళ్లి పని చేస్తుంటారు. ఆ గ్రామం మీదుగా రైల్వే మార్గం ఉన్నప్పటికీ అక్కడ రైలు ఆగదు. గ్రామానికి రైల్వే స్టేషన్ రావాలని అప్పలసూరి (జగపతి బాబు) ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు పెద్ది మంచి క్రికెటర్ కావడంతో రాంబుజ్జి (దివ్యేందు శర్మ) అతడిని కేంద్రంగా చేసుకుని క్రికెట్ పందేలు నిర్వహిస్తుంటాడు.
వివరాలు
కథ ఏంటంటే..
అచ్చాయమ్మ (జాన్వీ కపూర్)ను చూసిన తొలి క్షణం నుంచే ప్రేమలో పడతాడు పెద్ది. రాజకీయ విభేదాల కారణంగా అచ్చాయమ్మను అవమానించేందుకు ప్రయత్నించిన రాంబుజ్జి వర్గాన్ని పెద్ది ఎదిరిస్తాడు. దీంతో అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు క్రికెట్‌లో పరువు తీయాలని ప్రయత్నిస్తారు. పెద్ది ఆటలోని ప్రతిభను గుర్తించిన గౌరినాయుడు అతడిని కుస్తీ వైపు మళ్లిస్తాడు. చివరకు పెద్ది కుస్తీ నేర్చుకున్నాడా? తన గ్రామానికి ప్రభుత్వ గుర్తింపు తీసుకొచ్చాడా? రైల్వే స్టేషన్ సాధించగలిగాడా? గ్రామ ప్రజల భవిష్యత్తు కోసం ఎలాంటి పోరాటం చేశాడు? అచ్చాయమ్మతో ప్రేమకథకు ఎలాంటి ముగింపు దక్కింది? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా.
వివరాలు
సినిమా ఎలా ఉంది?
మొదటి నుంచి 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులు దీన్ని పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా భావించినా, తెరపై మాత్రం ఇది బలమైన భావోద్వేగాలతో నిండిన స్పోర్ట్స్ డ్రామాగా కనిపిస్తుంది. ఒలింపిక్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారికి పెద్ది గ్రామం గురించి చెప్పే నేపథ్యంలో కథ ఫ్లాష్‌బ్యాక్ రూపంలో ముందుకు సాగుతుంది. తొలి భాగంలో పెద్ది గ్రామం, అక్కడి ప్రజల జీవన విధానం, వారి కష్టాలు, క్రికెట్ ఎపిసోడ్లు, అచ్చాయమ్మ ప్రేమకథ, రాంబుజ్జితో విభేదాలు, అప్పలసూరి ప్రయత్నాలు ప్రధానంగా చూపించారు. ఇంటర్వెల్ సమయంలో కుస్తీ వైపు అడుగులు వేయబోతున్న పెద్ది పాత్రకు బలమైన హైప్ ఇచ్చారు.
వివరాలు
సినిమా ఎలా ఉంది?
రెండో భాగం పూర్తిగా పెద్ది పోరాటం చుట్టూ తిరుగుతుంది. కుస్తీలో అతడు ఎలా ఎదిగాడు? తన గ్రామానికి గుర్తింపు ఎలా సాధించాడు? అనే అంశాలను భావోద్వేగాలతో నడిపించారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ పోటీల్లో హీరో గెలుస్తాడా లేదా అనే ఉత్కంఠను దర్శకుడు చివరి వరకు నిలబెట్టాడు. అభిమానులను ఆకట్టుకునే ఎలివేషన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండో భాగంలోని భావోద్వేగ సన్నివేశాలు బలంగా పనిచేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. సాధారణ ప్రేక్షకులు కూడా కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనవుతారు.
వివరాలు
సినిమా ఎలా ఉంది?
యాక్షన్ ఎపిసోడ్లు, కుస్తీ పోటీలు ఆకట్టుకునేలా తెరకెక్కించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ కుస్తీ యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు ప్రస్తావనలు కూడా కథలో కనిపిస్తాయి. అయితే జాన్వీ కపూర్ పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం అంతగా ప్రభావం చూపదు. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. ప్రేమకథను మరింత బలంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా ముగించారు. రెండో భాగంలో కొన్ని కుస్తీ సన్నివేశాలు కొంత నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. జగపతి బాబు పాత్రకు ఇంకాస్త స్క్రీన్ టైమ్ ఉంటే బాగుండేదనిపిస్తుంది. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు అసౌకర్యంగా అనిపిస్తాయి. అయినప్పటికీ చరణ్ అభిమానులకు ఇది ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
వివరాలు
నటీనటుల ప్రతిభ
కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా నిలుస్తుంది. క్రీడాకారులు, స్పోర్ట్స్ ప్రేమికులకు ఈ సినిమా మరింత దగ్గరవుతుంది. ఆటగాడి జీవితం, క్రీడల విలువ, దేశ అభివృద్ధిలో క్రీడల ప్రాధాన్యం వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రామ్ చరణ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి మూడు విభిన్న క్రీడలకు అనుగుణంగా తన శరీరాకృతిని మార్చుకోవడంలో అతడు చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్,డ్యాన్స్‌లతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన ముద్ర వేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చరణ్ నటన సినిమాకు ప్రధాన బలం. జాన్వీ కపూర్ తన పాత్ర పరిధిలో నటించినప్పటికీ పాత్రకు పెద్దగా బలం లేకపోవడం మైనస్‌గా మారింది.
వివరాలు
నటీనటుల ప్రతిభ
దివ్యేందు శర్మ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మెప్పించాడు. శివరాజ్ కుమార్ కుస్తీ కోచ్ పాత్రలో గంభీరమైన నటన కనబరిచారు. జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర కథకు బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉపేంద్ర లిమయే కూడా తన పాత్రలో ఆకట్టుకున్నారు. శృతి హాసన్ ప్రత్యేక గీతంలో మెరిసింది. విజి చంద్రశేఖర్, బొమన్ ఇరాని, సత్య, చమ్మక్ చంద్ర, తారక్ పొన్నప్ప, అర్జున్ అంబటి, శ్రీకాంత్ అయ్యంగార్, జాన్ విజయ్, రవి కిషన్, రాజత్ దత్తా, ఆడుకాలం నరేన్, మహేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
వివరాలు
సాంకేతిక విభాగం
సాంకేతికంగా 'పెద్ది' అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అందించిన విజువల్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ నేపథ్యం, క్రీడా పోటీలు, భావోద్వేగ క్షణాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం అనేక సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా మార్చింది. పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందగా, తెరపై కూడా అవి ఆకట్టుకుంటాయి. లొకేషన్లు, సెట్లు సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ పరంగా కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేదనే భావన కలుగుతుంది.
వివరాలు
సాంకేతిక విభాగం
అయితే క్రీడలకు సంబంధించిన కొన్ని మాంటేజ్‌లు, ట్రాన్సిషన్లు బాగా కుదిరాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన ఒక సాధారణ గ్రామం గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని క్రీడలతో ముడిపెట్టి స్ఫూర్తిదాయకంగా, భావోద్వేగంగా చెప్పే ప్రయత్నం చేశారు. కమర్షియల్ అంశాలతో పాటు సందేశాన్ని కూడా సమతుల్యంగా అందించారు. సంభాషణలు పలుచోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.
వివరాలు
తీర్పు
'పెద్ది' కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు. గుర్తింపు కోసం పోరాడిన ఓ ఆటగాడి కథ. తన గ్రామం, తన ప్రజల కోసం కలలు కన్న యువకుడి ప్రయాణం. భావోద్వేగాలు, క్రీడా స్ఫూర్తి, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన సినిమాకు అతిపెద్ద బలంగా నిలుస్తుంది. రేటింగ్: 3.5/5