పండంటి పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం నిన్న సాయంత్రం అపోలో హాస్పిటల్స్ చేరుకున్న ఉపాసన, ఈరోజు తెల్లవారు జామున పాపాయికి జన్మనిచ్చినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడి చేసాయి. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలియజేసారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. మెగా కుటుంబంలో మూడవ తరం మొదలు కావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియాలో మెగా అభిమానుల నుండి అభినందనల కామెంట్లు వస్తూనే ఉన్నాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని గతేడాది డిసెంబరు నెలలో మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. ఉపాసన సీమంతం ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
బొడ్డు తాడు రక్తాన్ని స్టోర్ చేస్తానని వెల్లడించిన ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2012లో వివాహం జరిగింది. దాదాపు పదకొండేళ్ళ తర్వాత మెగా ఫ్యామిలీలోకి కొత్త తరం అడుగుపెట్టింది. పుట్టిన పాపాయి బొడ్డు తాడు రక్తాన్ని(స్టెమ్ సెల్ బ్యాంకింగ్) స్టెమ్ సెల్ ఇండియా కంపెనీ ద్వారా స్టోర్ చేస్తానని కొన్ని రోజుల క్రితం ఉపాసన ప్రకటించారు. భవిష్యత్తులో పాపాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదన్న ఉద్దేశ్యంతో బొడ్డు తాడు రక్తాన్ని స్టోర్ చేస్తున్నట్లు తెలియజేస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఉపాసన.