Ramayana New Poster out: 'రామాయణ' పోస్టర్‌లో రణ్‌బీర్, సాయి పల్లవి.. యశ్‌ను రావణుడిగా ఎందుకు తీసుకున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' (Ramayana). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవిలో వనవాసం చేస్తున్నప్పటి నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతాదేవిగా సాయి పల్లవి (Sai Pallavi), లక్ష్మణుడిగా రవి దూబే ఆకట్టుకుంటున్నారు.
వివరాలు
యశ్ ఎంపికపై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సినిమాలో రావణుడి పాత్రలో కన్నడ సూపర్‌స్టార్ యశ్ (Yash) నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా 'రామాయణ'కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత నమిత్ మల్హోత్రా.. యశ్‌ను రావణుడి పాత్రకు ఎంపిక చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'దురాశ, అధికారంపై కాంక్ష పెరిగినప్పుడు మనిషి తనలోని మంచితనాన్ని, జాలిని కోల్పోతాడు. రావణుడు అలాంటి ప్రతికూల శక్తికి ప్రతీక. అందరూ ద్వేషించే ఆ పాత్రను చేసేందుకు ఎంతో ధైర్యం కావాలి.
యశ్ కేవలం నటుడిగానే కాకుండా ఓ నిర్మాత రూపంలో ప్రాజెక్టుకు వెన్నెముకలా నిలబడ్డారు. యశ్ లేకుండా 'రామాయణ' ప్రయాణం అసంపూర్ణం'' అని నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు.
వివరాలు
మిస్టర్ బీస్ట్‌తో 'యాంగ్రీ బర్డ్స్ 3'
ఈ ప్రచార కార్యక్రమంలో ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిస్టర్ బీస్ట్‌తో కలిసి 'యాంగ్రీ బర్డ్స్ 3' (Angry Birds 3) చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నమిత్ మల్హోత్రా ప్రకటించారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'రామాయణ పార్ట్-1' 2026 దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.