Irumudi Review: 'ఇరుముడి' మూవీ రివ్యూ.. స్వామియే శరణం అయ్యప్ప.. ఏడిపించేశారుగా..
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర, సాయి కుమార్, శ్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య 'ఇరుముడి' సినిమా ఆగస్టు 21న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వివరాలు
కథ విషయానికొస్తే..
త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (నక్షత్ర)తో కలిసి సీలేరు సమీపంలోని ఓ గ్రామంలో అరటిపళ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు.
కూతురంటే త్రినాథ్‌కు ఎంతో ప్రేమ. రోజూ మద్యం తాగుతూ ఉండే అతడు.. కూతురి కోసం మాత్రం ప్రతి ఏడాది తన గురుస్వామి (సాయి కుమార్) వద్ద అయ్యప్ప మాల ధరిస్తూ ఎంతో నిష్టగా ఉంటాడు.
అయితే గ్రామంలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా, ఎవరైనా ఆడపిల్లను ఏడిపించినా త్రినాథ్ సహించడు.
ప్రతి ఆడపిల్లను తన కూతురిలాగే భావించి, వారిని ఇబ్బంది పెట్టేవారితో గొడవకు దిగుతుంటాడు. దీంతో అతడికి చాలామంది శత్రువులు తయారవుతారు.
వివరాలు
అనూహ్య సంఘటనల మధ్య సినిమా..
త్రినాథ్ తన కూతురు మణికంఠను సీలేరు హైస్కూల్‌లో చేర్పిస్తాడు. అక్కడ వరుసగా కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి.
ఆడపిల్లలు చనిపోవడం, మణికంఠకు తెలిసిన ఓ అమ్మాయి స్కూల్ మానేయడం, టీచర్ ధనలక్ష్మి చాలా కఠినంగా వ్యవహరించడం, ఆమె వల్ల ఆడపిల్లలు ఇబ్బందులు పడటం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.
బయట ఏం జరిగినా తన తండ్రికి చెప్పడం మణికంఠకు అలవాటు. మరి స్కూల్‌లో జరుగుతున్న విషయాల గురించి మణికంఠకు ఏం తెలుస్తుంది?
ఆమె తన తండ్రికి ఆ నిజాలను చెబుతుందా? టీచర్ ధనలక్ష్మి ఏం చేస్తుంది? త్రినాథ్ అయ్యప్ప మాల ధరించే సమయంలో అతడిపై దాడి చేసేందుకు ఎదురుచూస్తున్న శత్రువులు ఏం చేస్తారు?
చివరికి ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.