Prabhas : రెబల్ స్టార్ 'ఫౌజీ'లో అదిరిపోయే లవ్ స్టోరీ.. ఆ సీన్స్ సినిమాకే హైలైట్ అంట!
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ (Fauji) ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటీష్ పాలనా కాలంలో భారత సైన్యంలో పనిచేసే ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. 'సీతారామం' వంటి క్లాసిక్ ప్రేమకథను అందించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండటంతో, 'ఫౌజీ'లో కూడా బలమైన ప్రేమకథ ఉండబోతుందనే ప్రచారం మొదటి నుంచే సాగుతోంది. యుద్ధం నేపథ్యంలో పుట్టిన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
వివరాలు
సైనికుడి గెటప్ ప్రభాస్ కి ప్రత్యేక ఆకర్షణ
తాజా సమాచారం ప్రకారం, రెండో ప్రపంచ యుద్ధం (సెకండ్ వరల్డ్ వార్) నేపథ్యంలోని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు, ప్రభాస్, హీరోయిన్ ఇమాన్వి (imanvi) మధ్య సాగే ప్రేమకథ, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఇప్పటి వరకు ఆయన ఇలాంటి పాత్రలో కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. దీంతో 'ఫౌజీ' కోసం రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసే అవకాశం
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ (Spirit) చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే 'ఫౌజీ' మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3న విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరి 'ఫౌజీ'తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.