Aadarsha Kutumbam Review: రివ్యూ.. ఆదర్శ కుటుంబం AK 47.. వెంకటేష్ నటన ఎలా ఉంది? సినిమా మెప్పించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం AK 47'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించగా.. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ అంశాలన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిత్రబృందం కూడా ప్రమోషన్లను గట్టిగానే నిర్వహించింది. అయితే సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వెంకటేష్ నటన, త్రివిక్రమ్ దర్శకత్వం ఎంతవరకు ఆకట్టుకున్నాయి?
వివరాలు
ఆదర్శ కుటుంబం AK 47 కథ
ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించిందా? ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. చిట్టిబాబు (వెంకటేష్) ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుంటాడు.
భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), కొడుకు సర్వ (ప్రజ్వల్), కుమార్తె (యువినా పార్థవి)తో కలిసి సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుంటాడు.
అయితే భార్య స్వర్ణ చీటీ పాట కారణంగా కుటుంబానికి రూ.4 లక్షల నష్టం వస్తుంది. మరోవైపు కొడుకు ఆపరేషన్ కోసం రూ.2 లక్షలు అవసరమవుతాయి.
దీంతో ఆ డబ్బును ఎలా సమకూర్చుకోవాలా అని చిట్టిబాబు ఆలోచిస్తుంటాడు.
ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్ ఆ కుటుంబం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. ఆ టికెట్‌కు ఏకంగా రూ.100 కోట్ల బహుమతి తగులుతుంది.
వివరాలు
త్రివిక్రమ్ దర్శకత్వం ప్లస్ పాయింట్
దీంతో అప్పటివరకు ఓ చిన్న కాలనీలో నివసించిన చిట్టిబాబు కుటుంబం.. పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోకి మారుతుంది.
మరోవైపు బీహార్‌కు చెందిన ఓ దోపిడీ ముఠా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో చిట్టిబాబు కుటుంబానికి వచ్చిన రూ.100 కోట్లపై ఆ ముఠా కన్నుపడుతుంది.
ఆ డబ్బును దొంగిలించేందుకు పథకం వేస్తుంది. ఇందులో భాగంగా ముఠాకు చెందిన నీలా (దేవియాని శర్మ), ఆమె తమ్ముడు పింటూ చిట్టిబాబు ఇంట్లో పనివాళ్లుగా చేరతారు.
సరైన సమయం చూసుకుని ఓ రాత్రి ఆ ఇంట్లోని డబ్బును దొంగిలించాలని ప్లాన్ చేస్తారు.
మరి ఆ ముఠా అనుకున్నది సాధించిందా? చిట్టిబాబు కుటుంబం నుంచి రూ.100కోట్లు దొంగిలించగలిగిందా? ఈ సమస్య నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది?
వివరాలు
విశ్లేషణ
ఈ కథలో చిత్తరంజన్ (సత్య), డీఎస్పీ బృహస్పతి (రావు రమేష్), ఎస్పీ (నారా రోహిత్) పాత్రలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.
వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఏర్పడింది.
ఈసారి త్రివిక్రమ్ తనదైన శైలిలో కథను తెరకెక్కిస్తారా? లేక కొత్త జానర్‌లో ఏదైనా ప్రయోగం చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీనికి తోడు సినిమా గురించి పలు రకాల ప్రచారాలు కూడా సాగాయి.
ఇటీవల విడుదలైన 'బ్లాస్ట్' సినిమాకు ఈ చిత్ర కథ దగ్గరగా ఉంటుందని, కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారని కూడా వార్తలు వినిపించాయి.
ఇలా సినిమాకు సంబంధించి సానుకూల ప్రచారం కంటే ఇలాంటి చర్చలే ఎక్కువగా జరిగాయి.
వివరాలు
మధ్యతరగతి వ్యక్తి పాత్రలో వెంకటేష్
ఈ నేపథ్యంలో ఎలాంటి భారీ అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్లడం మంచిది.
సినిమా ప్రారంభంలోనే చిట్టిబాబు అనే సాధారణ మధ్యతరగతి వ్యక్తి పాత్రలో వెంకటేష్ పరిచయమవుతాడు.
అతడి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సరదా గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలతో కథ ముందుకు సాగుతుంది.
ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ కుటుంబానికి రూ.100 కోట్ల లాటరీ తగలడం కొంత లాజిక్‌కు దూరంగా అనిపిస్తుంది.
ఓ సాధారణ కుటుంబానికి వంద కోట్ల లాటరీ రావడం, అదే సమయంలో ఓ దోపిడీ ముఠా ఆ కుటుంబం వెంట పడటం వంటి అంశాలు మొదట్లో కొంత అసహజంగా అనిపించినా.. వాటిని ఆసక్తికరంగా తెరకెక్కించారు.
వివరాలు
కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి
ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అంతకుముందు లాజిక్ లెస్‌గా అనిపించిన కొన్ని అంశాలకు కూడా ఆ సన్నివేశాలతో సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సెకండాఫ్ ప్రారంభమైన తర్వాత ఫస్టాఫ్ ఇచ్చినంత కిక్ రావడం లేదనే భావన కలుగుతుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ మళ్లీ ఆసక్తి పెరుగుతుంది.
ఓ దోపిడీ ముఠా ఒక కుటుంబం వెనుక పడటం, ఆ ముఠా నుంచి తమను తాము రక్షించుకోవడానికి కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలను ఆసక్తికరంగా చూపించారు.
పోలీసులకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. మొత్తంగా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం జరిగింది.
వివరాలు
నటీనటుల పనితీరు
అక్కడక్కడా కొంత బోర్ కొట్టించినా.. కథలోని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తాయి. దర్శకుడు రాసుకున్న ట్విస్టులు కూడా సినిమాకు బలంగా నిలిచాయి.
కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించేలా ఉన్నప్పటికీ.. మరికొన్ని మాత్రం ఆకట్టుకుంటాయి. చిట్టిబాబు పాత్రలో విక్టరీ వెంకటేష్ పూర్తిగా ఒదిగిపోయారు.
ఇలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన పాత్రలు చేయడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈ సినిమాలో ఆయన నటన చూస్తుంటే 'దృశ్యం' చిత్రంలోని పాత్ర గుర్తుకు వస్తుంది.
తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో వెంకటేష్‌తో "నేనేనా కమల్ హాసన్ లేదా మోహన్‌లాల్ అనుకున్నావా?" అనే డైలాగ్ చెప్పించడం ఆసక్తికరంగా ఉంటుంది.
వివరాలు
శ్రీనిధి నటన అద్భుతం
అలాంటి డైలాగ్‌ను ఆయనతోనే చెప్పించడం కొంత సాహసంతో కూడుకున్న విషయమే. అయితే ఈ సన్నివేశం ద్వారా ప్రేక్షకుల్లో వెంకీ మామపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచే ప్రయత్నం చేశారు.
స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి కూడా చక్కగా నటించారు. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలు కలగలిసిన పాత్రలో ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు.
ఇక నివేదా పేతురాజ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సినిమాలో కనిపించే రెండు మూడు సన్నివేశాల్లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన రాజా, ప్రజ్వల్‌తో పాటు యువినా పార్థవి కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. 'దురంధర్' ఫేమ్ నటుడు విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు.
వివరాలు
సాంకేతిక విభాగం
సాంకేతికంగా చూస్తే తమన్ తన పనితనాన్ని మరోసారి చూపించారు. సినిమాలోని పాటలు ప్రేక్షకుల్లో పెద్దగా ఆదరణ పొందకపోయినా.. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచింది. ఈ చిత్రంలోని ప్రధాన హైలైట్స్‌లో నేపథ్య సంగీతం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.
దర్శకుడు త్రివిక్రమ్ తనదైన మార్క్‌ను మిస్ కాకుండానే ఈసారి కొంత కొత్త జానర్‌ను ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించారని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఎడిటింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సెకండాఫ్‌పై మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత బాగుండేది.
వివరాలు
ఫైనల్‌గా..
మొత్తంగా 'ఆదర్శ కుటుంబం AK 47' ఓ ఎంగేజింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. వెంకటేష్ నటన, త్రివిక్రమ్ మార్క్ సన్నివేశాలు, ఆసక్తికరమైన ట్విస్టులు, తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
అక్కడక్కడా లాజిక్‌కు దూరంగా అనిపించే సన్నివేశాలు, సెకండాఫ్‌లో కొంత నెమ్మదించిన కథనం చిన్న చిన్న లోపాలుగా కనిపిస్తాయి.
అయినప్పటికీ కుటుంబంతో కలిసి చూసేలా ఆసక్తికరంగా సాగుతుంది.