Loading...
Summer Holidays Review: రివ్యూ: సమ్మర్ హాలిడేస్.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందా?
రివ్యూ: సమ్మర్ హాలిడేస్.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందా?

Summer Holidays Review: రివ్యూ: సమ్మర్ హాలిడేస్.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం నాలుగు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో మూడు అనువాద చిత్రాలు కాగా, మరొకటి నేరుగా తెలుగులో తెరకెక్కిన సినిమా. బాలనటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రమే 'సమ్మర్ హాలిడేస్'. అగ్రతారలు లేకపోయినా, కథనే ప్రధాన బలంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాపై చిత్రబృందం గట్టిగానే ప్రచారం నిర్వహించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం.

వివరాలు

కథేంటంటే?

పట్నంలో చదువుకుంటున్న కుర్రాడు ఆర్‌.వి. (అరుణ్ దేవ్). అతడి తండ్రి (హర్షవర్ధన్) ఎప్పుడూ మార్కులు, ర్యాంకుల గురించే మాట్లాడుతూ చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటాడు.

కానీ ఆర్‌.వీ.కి మాత్రం క్రికెట్ అంటే చాలా ఇష్టం. తనకున్న ఆసక్తిని తండ్రికి ధైర్యంగా చెప్పలేని బలహీనత అతడిది. దీంతో జీవితంలో సంతోషం అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉంటాడు.

ఇలాంటి సమయంలో వేసవి సెలవులు రావడంతో తల్లి (వాసుకి)తో కలిసి తోటవారిపాలెంలోని అమ్మమ్మ (జయసుధ) ఇంటికి వెళ్తాడు.

అక్కడ అతడికి కేవీ (రోహన్ రాయ్) పరిచయమవుతాడు. ఇద్దరూ భిన్నమైన వాతావరణాల్లో పెరిగినప్పటికీ, కొద్దిరోజుల్లోనే మంచి స్నేహితులుగా మారతారు. పైకి ఎంతో నవ్వుతూ, సరదాగా కనిపించే కేవీ జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలు ఉంటాయి.

వివరాలు

ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలియాలంటే మూవీ చూడాల్సిందే

తాగుడుకు బానిసైన అతడి తండ్రి మరణించడంతో కుటుంబంపై అప్పుల భారం పడుతుంది. మరోవైపు తననే ప్రపంచంగా భావించే తల్లి (హర్షిణి)కి కొత్త చీర కొనివ్వాలన్నది కేవీ ఆశ.

ఆ కోరిక నెరవేర్చడం కోసం పాఠశాలకు వెళ్తూనే ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి వార్తాపత్రికలు వేస్తుంటాడు. ఇదే సమయంలో వర్మ (రాజీవ్ కనకాల) తోటలోని కొన్ని మామిడి చెట్లను లీజుకు తీసుకుని పంట పండించేందుకు కేవీ ప్రయత్నిస్తాడు.

మరి అతడి ప్రయత్నం ఫలించిందా? ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడ్డాడా? వేసవి సెలవుల్లో కేవీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?

కేవీ నుంచి ఏం నేర్చుకున్నాడు? 2001 నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో సుమతి (బేబీ ఖుషి) పాత్ర ఏమిటి? అన్నది మిగతా సినిమా.

ADVERTISEMENT

వివరాలు

సినిమా ఎలా ఉందంటే?

అమ్మమ్మ ప్రేమగా ఆవకాయ కలిపి తినిపించిన గోరుముద్దలు.. రాత్రివేళ కరెంట్ పోగానే డాబాపైకి తీసుకెళ్లి చెప్పిన కథలు..

అమ్మమ్మ ఊరిలోని మామిడి తోటలు.. అక్కడ కొబ్బరిమట్టలను క్రికెట్ బ్యాట్లుగా చేసుకుని ఆడిన ఆటలు.. పక్కనే ఉన్న చెరువులో స్నేహితులంతా కలిసి గంటలకొద్దీ ఈత కొట్టిన రోజులు.. ఇవన్నీ చాలామందికి ఎప్పటికీ మర్చిపోలేని బాల్య జ్ఞాపకాలు.

వీటిలో కొన్ని అనుభవించిన వారికి ఆ రోజులను మరోసారి గుర్తుచేసే హృద్యమైన చిత్రమే 'సమ్మర్ హాలిడేస్'.

అయితే ఈ సినిమా కేవలం పాత జ్ఞాపకాలను గుర్తుచేయడానికే పరిమితం కాలేదు. స్వచ్ఛమైన స్నేహం చుట్టూ అల్లుకున్న అందమైన కథను చూపించింది. కష్టపడి పనిచేసి మన కలలను నెరవేర్చుకోవడంలోనే అసలైన తృప్తి ఉంటుందన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఆకట్టుకొనే సన్నివేశాలు

జీవితం అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని ఈ చిత్రం చెబుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే నేర్పు, ఆత్మవిశ్వాసం అవసరమనే సందేశాన్ని అందిస్తుంది.

ప్రధాన పాత్రల్లో చిన్నారులు కనిపించినప్పటికీ, ఆ పాత్రల్లో పెద్దలు కూడా తమ బాల్యాన్ని చూసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెరపై ఎక్కువగా హింస, రక్తపాతం కనిపిస్తున్న తరుణంలో పచ్చని పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, సహజమైన భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది.

ఆర్‌.వీ.కి, అతడి తండ్రికి మధ్య సన్నివేశాలతో సినిమా ప్రారంభమైనప్పటికీ.. కథ అమ్మమ్మ ఊరికి చేరుకున్నాక ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

ఆర్‌.వీ., కేవీ కలిసినప్పటి నుంచి సినిమా మరింత సందడిగా సాగుతుంది.

వివరాలు

విరామ సన్నివేశాలు అద్భుతం

వాళ్లు కలిసి ఆడే క్రికెట్, ఇద్దరి మధ్య పెరిగే స్నేహం, సరదాలు, ఒకరి సమస్యలను మరొకరు తెలుసుకోవడం, ఆ తర్వాత పరస్పరం సహాయం చేసుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా కేవీ లీజుకు తీసుకున్న మామిడి చెట్లను ప్రధానంగా చేసుకుని ఇద్దరు స్నేహితుల కథను నడిపించిన తీరు బాగుంది. విరామ సన్నివేశాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి.

ద్వితీయార్ధంలో కథ చాలావరకు ముందుగానే ఊహించేలా సాగుతుంది.

అయినప్పటికీ అమ్మమ్మ ఇంట్లో ఆర్‌.వీ. పుట్టినరోజు వేడుకలు, తోటి చిన్నారులు చేసే అల్లరి పనులు, కేవీ పండించిన మామిడి పంట, దాన్ని మార్కెట్‌కు తరలించే సందర్భాలు, తల్లికి చీర కొనివ్వాలన్న అతడి కల నెరవేరే ఘట్టాలు భావోద్వేగాలను పండిస్తాయి.

వివరాలు

మాటలు ప్రధాన బలం

పతాక సన్నివేశాలు మరింత హృద్యంగా సాగుతాయి. అమ్మమ్మ ఊరి నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఆర్‌.వీ.లో కనిపించే మార్పు, తండ్రితో అతడు చెప్పే మాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి.

కేవీ, సుమతి పాత్రల ద్వారా దర్శకుడు కథకు చక్కటి ముగింపునిచ్చారు. గత తరానికి చెందిన ప్రేక్షకులను ఈ సినిమా వారి బాల్యంలోకి తీసుకెళ్లి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.

కథే అతిపెద్ద తారగా, మన మూలాలు, విలువలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఇలాంటి చిత్రాలకు ఆదరణ దక్కాల్సిన అవసరం ఉంది.

అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపించినప్పటికీ, అడుగడుగునా కనిపించే సహజత్వం ప్రేక్షకులకు అమ్మమ్మ ఊరికి వెళ్లి వచ్చిన అనుభూతిని కలిగిస్తుంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే?

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రధానంగా రోహన్ రాయ్, అరుణ్ దేవ్ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరూ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

అమాయకత్వం, హాస్యం, భావోద్వేగాలను సహజంగా పలికించారు. బేబీ ఖుషితో పాటు పలువురు బాలనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

అమ్మమ్మ పాత్రలో జయసుధ ప్రాణం పోశారు. కేవీ తల్లి పాత్రలో హర్షిణికి మంచి ప్రాధాన్యం దక్కింది. ఆమె తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

అలాగే ఆర్‌.వీ. తల్లిదండ్రులుగా నటించిన వాసుకి, హర్షవర్ధన్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

వర్మ పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించారు. వీళ్లందరితో పాటు సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉంది. అదే మామిడి చెట్టు.

వివరాలు

పల్లెటూరి అందాలను తెరపై చక్కగా ఆవిష్కరణ

కథ మొత్తం ఆ చెట్టు చుట్టూనే సాగడం విశేషం. సాంకేతిక విభాగాల పనితీరు కూడా బాగుంది. ఛాయాగ్రాహకుడు సాయిప్రకాశ్ పల్లెటూరి అందాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు.

సింజిత్ స్వరపరిచిన పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. చాలా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం వాటి ప్రభావాన్ని మరింత పెంచింది.

ఇతర సాంకేతిక విభాగాలు కూడా మంచి పనితీరును కనబరిచాయి. దర్శకుడు శ్రీకర్ నయన్‌కు ఇది తొలి సినిమా అయినప్పటికీ, కథను ఎంతో స్పష్టతతో, నిజాయతీగా తెరకెక్కించారు.

అక్కడక్కడా హాస్యం, భావోద్వేగాలను చక్కగా పండించారు. మోతాదుకు మించకుండా వినోదాన్ని, భావోద్వేగాలను మేళవించారు.

ఇలాంటి కథను నమ్మి సినిమాగా నిర్మించడం అంత సులభం కాదు. ఈ విషయంలో నిర్మాతల ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

వివరాలు

బలాలు

కథ, పల్లెటూరి నేపథ్యం

నటీనటుల సహజమైన నటన

సంగీతం, నేపథ్య సంగీతం

స్వచ్ఛమైన హాస్యం, భావోద్వేగాలు

బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు

బలహీనతలు

ముందుగానే ఊహించగలిగే కథ

కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: 'సమ్మర్ హాలిడేస్'.. ఓ మంచి జ్ఞాపకం!

ADVERTISEMENT