Sai Pallavi: పాత్ర కోసం పొడవాటి జుట్టు కత్తిరించుకున్న సాయి పల్లవి.. విషయం తెలిసి ఫోన్ పెట్టేసిన తల్లి!
ఈ వార్తాకథనం ఏంటి
మేకప్ లేకుండానే సహజ అందంతో, తన పొడవాటి ఉంగరాల జుట్టుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది 'నేచురల్ బ్యూటీ' సాయి పల్లవి. అయితే తనకు ఎంతో ఇష్టమైన ఆ జుట్టు విషయంలో ఆమె తీసుకున్న ఓ నిర్ణయం ఇంట్లో పెద్ద చర్చకు దారితీసిందట. కూతురు జుట్టు కత్తిరించుకుందని తెలిసి ఆమె తల్లి ఎంతలా బాధపడ్డారంటే.. కనీసం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారట. తాజాగా సాయి పల్లవి వెల్లడించిన ఈ విషయం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
వివరాలు
ఐపీఎస్ అధికారిగా కొత్త లుక్
'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం '#OM'. ఇందులో సాయి పల్లవి మునుపెన్నడూ చేయని విధంగా ఓ పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది.
ఆమె పాత్ర పేరు 'నిత్యా రెడ్డి'. సాధారణంగానే సాయి పల్లవి ఏ పాత్రలో నటించినా అందులో పూర్తిగా ఒదిగిపోతుంది.
ఈ సినిమాలోని నిత్యా రెడ్డి పాత్ర కోసం దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఓ ప్రత్యేకమైన లుక్‌ను రూపొందించారు.
నిజ జీవితంలో డాషింగ్ ఐపీఎస్ అధికారిగా పేరొందిన మెరిన్ జోసెఫ్ గెటప్ స్ఫూర్తితో సాయి పల్లవిని పొట్టి జుట్టుతో చూపించాలని దర్శకుడు నిర్ణయించారు.
వివరాలు
జుట్టు కత్తిరించుకుందని తెలిసి తల్లి షాక్
పాత్ర డిమాండ్ మేరకు తన ఒత్తైన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడానికి సాయి పల్లవి సిద్ధపడింది. సాధారణంగా ఆడపిల్లల జుట్టు విషయంలో తల్లులు ఎంతో సెంటిమెంట్‌గా ఉంటారు. సాయి పల్లవి తల్లి కూడా ఇందుకు మినహాయింపు కాదట.
షూటింగ్ కోసం తాను హెయిర్ కట్ చేయించుకున్నాననే విషయాన్ని ఫోన్ చేసి ఆమె తల్లికి చెప్పిందట.
ఆ విషయం వినగానే ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని సాయి పల్లవి వెల్లడించింది.
కూతురు తన అందమైన జుట్టును కత్తిరించుకుందన్న కోపం, బాధతో వెంటనే ఫోన్ పెట్టేశారట. కొన్నాళ్ల పాటు ఆమె ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారని తెలిపింది.
వివరాలు
సినిమాపై ఫ్యాషన్‌తో సాహసోపేత నిర్ణయం
గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ ఓ పాత్ర సహజంగా కనిపించడం కోసం విగ్ ఉపయోగించకుండా నిజంగానే జుట్టు కత్తిరించుకోవడం సాధారణ విషయం కాదు.
ఇంట్లోవారు బాధపడతారని తెలిసినా.. సినిమా, పాత్రపై ఉన్న ఆసక్తితో సాయి పల్లవి ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన ఈ సాహసోపేత పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.