సలార్ సినిమాకు కేజీఎఫ్ తరహా ప్లానింగ్, రెండు భాగాల విషయంలో సంబరపడుతున్న అభిమానులు
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఇటలీ దేశంలో యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. జేమ్స్ బాండ్ నో టైం టు డై చిత్రీకరణ జరుపుకున్న ప్రాంతంలో సలార్ ఫైట్ సీన్స్ రూపొందుతున్నాయని సమాచారం. ప్రస్తుతం సలార్ సినిమా నుండి ప్రభాస్ అభిమానుల కోసం క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సలార్ సినిమా రెండు భాగాలుగా ఉంటుందట. అవును, కేజీఎఫ్ మాదిరిగానే సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని కన్నడ నటుడు దేవరాజ్ వెల్లడి చేశారు.
రెండవ భాగంలో కీలకంగా కనిపించనున్న దేవరాజ్
ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన కన్నడ సీనియర్ నటుడు దేవరాజ్, తాను సలార్ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేశాడు. మొదటి భాగంలో తన పాత్ర పరిధి తక్కువగా ఉంటుందని, రెండవ భాగంలో తన పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు దేవరాజ్. దీంతో సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని కన్ఫామ్ అయిపోయిందంటూ ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై చిత్రబృందం నుండి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ విషయాన్ని ఇప్పుడే తెలియజేస్తారా లేకపోతే సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్ట్ గా తెలుస్తుందా అనేది చూడాలి. సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కనిపిస్తోంది. విలన్ గా మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కనిపిస్తున్నారు. హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై సలార్ సినిమా తెరకెక్కుతోంది.