Loading...
Romanchakam : ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Romanchakam : ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ పలు చిత్రాలను నిర్మిస్తున్నాడు. అలా సందీప్ రెడ్డి వంగా నిర్మాణంలో భాగమైన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల నిర్మాణంలోనూ సందీప్ రెడ్డి వంగాకు చెందిన భద్రకాళి పిక్చర్స్ భాగస్వామిగా వ్యవహరించింది.

వివరాలు

అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్

ఇదే సంస్థ తెలుగులో నిర్మించిన చిన్న సినిమా 'రోమాంచకం'. ఇందులో సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు.

రొమాంటిక్ కామెడీ, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 3న థియేటర్లలో విడుదలైంది.

సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లతో చిత్రబృందం హడావుడి చేసినప్పటికీ.. 'రోమాంచకం' ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 01, గురువారం నుంచి 'రోమాంచకం' నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

వివరాలు

'రోమాంచకం' కథేంటి?

'రోమాంచకం' కథ విషయానికొస్తే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) కాలేజీ చదువు పూర్తి చేసిన యువకుడు.

తన స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగా 'రోమాంచకం' పేరుతో ఓ డేటింగ్ యాప్‌ను తీసుకురావాలనేది అతడి ఆలోచన.

అమ్మాయిలు, అబ్బాయిల అవసరాలను తీర్చేందుకే ఈ యాప్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు అన్వేష్ చెబుతుంటాడు.

ఈ డేటింగ్ యాప్ ద్వారానే చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనిల్‌కుమార్)తో అన్వేష్‌కు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యంగా మారుతుంది.

ADVERTISEMENT

వివరాలు

ఆ సర్ ప్రైజ్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే

మైథిలి పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకున్న అన్వేష్.. ఆమెను సర్‌ప్రైజ్ చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఇందుకోసం చెన్నైకి వెళ్తాడు. తాను ఓ హోటల్‌లో ఉన్నానని, అక్కడికి రావాలని మైథిలికి కబురు పంపిస్తాడు.

తాను వస్తానని చెప్పిన మైథిలి.. ఆ వెంటనే ఫోన్‌లో, సోషల్ మీడియా అకౌంట్లలో అన్వేష్‌ను బ్లాక్ చేసేస్తుంది.

అసలు మైథిలి హోటల్‌కు ఎందుకు రాలేదు? అన్వేష్‌ను ఫోన్‌లో, సోషల్ మీడియాలో ఎందుకు బ్లాక్ చేసింది? ఆమె మాయం కావడం వెనుక ఎవరున్నారు? ఆ తర్వాత మైథిలి మళ్లీ తిరిగి వచ్చిందా లేదా? అనేదే 'రోమాంచకం'లో మిగతా కథ.

ADVERTISEMENT