Satluj: ఓటీటీలో సడెన్ ఎంట్రీ.. రెండురోజుల్లోనే అదృశ్యం..ఏంటీ 'సత్లుజ్' వివాదం..?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకే సినిమా.. మూడు పేర్లు.. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగిన వివాదాలు.. చివరకు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో విడుదల.. కానీ విడుదలైన 48 గంటలు గడవకముందే స్ట్రీమింగ్ నుంచి తొలగింపు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న 'సత్లుజ్' సినిమా పరిస్థితి ఇదే. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదల నుంచి తొలగింపు వరకు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
వివరాలు
'సత్లుజ్' కథ ఏమిటి?
1990వ దశకంలో వేలాది గుర్తుతెలియని మృతదేహాల అక్రమ దహనాలపై దర్యాప్తు చేసిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ బయోపిక్ పొలిటికల్ డ్రామాను రూపొందించారు. హనీ ట్రెహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత సున్నితమైన చారిత్రక అంశాన్ని ప్రస్తావించడం వల్ల ప్రారంభం నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట ఈ సినిమాను 'ఘల్లుఘరా' పేరుతో ప్రకటించారు. అనంతరం దాని పేరును 'పంజాబ్ 95'గా మార్చారు. చివరికి ఓటీటీలో విడుదల చేసే సమయంలో 'సత్లుజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
వివరాలు
సెన్సార్ వివాదాలతో ఏళ్ల తరబడి ఆలస్యం
ఈ సినిమా 2022లోనే పూర్తయినప్పటికీ, విడుదలకు ముందు సెన్సార్ బోర్డు (CBFC) అనుమతుల దశలో వివాదం మొదలైంది. చిత్రానికి ఏకంగా 127 కట్స్ సూచించడంతో పాటు కొన్ని దృశ్యాలు, సంభాషణలు, సినిమా టైటిల్‌పైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అన్ని మార్పులు అమలు చేస్తే సినిమా అసలు ఉద్దేశం దెబ్బతింటుందని భావించిన నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. సెన్సార్, కాపీరైట్‌కు సంబంధించిన న్యాయపోరాటం కారణంగా సినిమా విడుదల దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఆలస్యమైంది.
వివరాలు
ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో విడుదల
థియేటర్లలో విడుదల చేయడం కష్టమని భావించిన చిత్రబృందం నేరుగా ఓటీటీ వేదికను ఎంచుకుంది. జులై 3న ఎలాంటి ప్రచారం లేకుండా జీ5లో 'సత్లుజ్' పేరుతో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దిల్జిత్ దొసాంజే స్పందిస్తూ.. ఓటీటీలో విడుదలైనది ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షనేనని తెలిపారు. ఒక్క కట్ అయినా ఉండి ఉంటే తాను ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేవాడిని కాదని స్పష్టం చేశారు. దీంతో చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఎట్టకేలకు చూసే అవకాశం లభించింది.
వివరాలు
రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ నిలిపివేత
అయితే సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే భారతదేశంలో జీ5 వేదిక నుంచి 'సత్లుజ్' తొలగించబడింది. దీనిపై స్పందించిన జీ5.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపింది. భారతీయ ప్రేక్షకుల కోసం మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అయితే సినిమా తొలగింపునకు గల ఖచ్చితమైన కారణాన్ని మాత్రం జీ5 వెల్లడించలేదు. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జీ5 గ్లోబల్ వేదికపై ఈ సినిమా ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతోంది. భారత్‌లో స్ట్రీమింగ్ నిలిపివేయగా విదేశాల్లో మాత్రం అందుబాటులో ఉండటం, దీనిపై స్పష్టమైన వివరణ లేకపోవడంతో 'సత్లుజ్' మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.