Anil Ravipudi : సినిమాలో ఛాన్స్ అంటూ మోసం.. వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ టీమ్ సంచలన ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం '#VenkyAnil5' (#NKRAR2)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు అమాయక యువతీ యువకులను లక్ష్యంగా చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని మభ్యపెట్టేందుకు '#VenkyAnil5' పేరుతో సోషల్ మీడియాలో నకిలీ కాస్టింగ్ కాల్స్ ప్రచారం చేస్తున్నట్లు యూనిట్ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
వివరాలు
అధికారిక ప్రకటన రిలీజ్
ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. "మా సినిమా పేరుతో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ కాస్టింగ్ కాల్‌కు మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని చిత్ర బృందం హెచ్చరించింది. '#VenkyAnil5' సినిమా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదిస్తున్న ఏ వ్యక్తికీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు లేదా ఇతర డాక్యుమెంట్లు ఇవ్వవద్దని సూచించింది.
వివరాలు
జాగ్రత్తగా ఉండండి
అలాగే ఆడిషన్స్, సెలెక్షన్లు లేదా సినిమా అవకాశాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని స్పష్టం చేసింది. తమ చిత్ర యూనిట్ ఎలాంటి కాస్టింగ్ ప్రక్రియ కోసం ఒక్క రూపాయి కూడా వసూలు చేయదని నిర్మాతలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ సినిమాకు సంబంధించి నిజమైన కాస్టింగ్ అవసరాలు ఏర్పడితే, వాటికి సంబంధించిన సమాచారం కేవలం అధికారిక, వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. "జాగ్రత్తగా ఉండండి.. మోసగాళ్ల బారిన పడవద్దంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు చిత్ర బృందం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది.