Ajay Devgn: ఇంట్లోనే సెలూన్, స్పా ఏర్పాటు.. స్టార్ హీరోకు షాకిచ్చిన బీఎంసీ!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు నోటీసులు జారీ చేశారు. ముంబయిలోని జుహులో ఉన్న అజయ్ దేవ్‌గణ్ బంగ్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు ఇచ్చారు. అజయ్ దేవ్‌గణ్ తన నివాసంలో సెలూన్, స్పా ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ పనులు చేపడుతున్నారని బీఎంసీ అధికారులు తెలిపారు. అయితే ఇందుకోసం ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు.
వివరాలు
హౌసింగ్ సొసైటీ ఫిర్యాదుతో చర్యలు
తమకు అందిన హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు బీఎంసీ వెల్లడించింది. జుహు బంగ్లా ప్రాంగణాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ అంశంపై బీఎంసీ అధికారులు మాట్లాడుతూ.. ఆ ప్రాంగణంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు లేవని తెలిపారు. ఫిర్యాదులు అందిన అనంతరం అజయ్ దేవ్‌గణ్‌ను ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు.
అయితే అజయ్ దేవ్‌గణ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే నిర్మాణ పనులను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు.