Loading...
CDSCO : పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో కిడ్నీలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక
పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో కిడ్నీలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక

CDSCO : పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో కిడ్నీలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన లేకుండా, అవసరానికి మించి లేదా ఎక్కువ కాలం ఉపయోగించడంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అప్రమత్తం చేసింది. ఇలాంటి మందుల అనియంత్రిత వినియోగం కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs), యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ముప్పు పెరగొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, వైద్యులు, ఫార్మసీలు, ఆసుపత్రులు, మందుల పంపిణీదారులకు పలు సూచనలు చేస్తూ సెప్టెంబర్ 21న అధికారిక సర్క్యులర్ జారీ చేసింది.

వివరాలు 

ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940, దాని నిబంధనలు-1945 ప్రకారం NSAIDs, యాంటీబయాటిక్స్‌లో చాలా మందులు 'షెడ్యూల్ హెచ్' పరిధిలోకి వస్తాయని CDSCO గుర్తుచేసింది.

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని రిటైల్ మెడికల్ షాపుల్లో విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

ఫార్మసీలు స్వీయ వైద్యాన్ని ప్రోత్సహించకూడదని సూచించింది.

నిబంధనలను ఉల్లంఘించి మందులు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

వివరాలు 

ప్రజలు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలి

చిన్నపాటి నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సొంతంగా పెయిన్‌కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని CDSCO ప్రజలకు సూచించింది.

మందులు వేసుకున్న తర్వాత కూడా సమస్య తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొంది.

ముఖ్యంగా ఏ మందు అవసరమో, ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుల సలహా మేరకే నిర్ణయించుకోవాలని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

కిడ్నీ సమస్యలున్నవారు ముందే చెప్పాలి

ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, డయాలసిస్ తీసుకుంటున్న రోగులు పెయిన్‌కిల్లర్స్ ఉపయోగించే ముందు తమ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు పూర్తి వివరాలు వెల్లడించాలి.

గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు, ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందుల సమాచారాన్ని కూడా వైద్యులకు తెలియజేయడం అవసరమని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

వైద్యులు జాగ్రత్తగా మందులు సూచించాలి

రోగికి NSAIDs, యాంటీబయాటిక్స్ సూచించే ముందు వయసు, ఇతర అనారోగ్య సమస్యలు, ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిగణనలోకి తీసుకోవాలని CDSCO పేర్కొంది.

అవసరమైన సందర్భాల్లో మాత్రమే, ముఖ్యంగా వైద్యపరంగా తగిన కారణం ఉన్నప్పుడు మందులు సూచించాలని సూచించింది.

రోగికి సరైన మోతాదు, వినియోగ విధానం, అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని తెలిపింది.

వివరాలు 

ఆసుపత్రుల్లో ప్రిస్క్రిప్షన్లపై నిఘా

ఆసుపత్రులు కూడా యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్‌కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షించాలని CDSCO ఆదేశించింది.

మందుల వినియోగంపై తగిన పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, రోగులకు అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది.

తద్వారా మందుల అనవసర వినియోగాన్ని తగ్గించి, వాటివల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

మొత్తంగా.. పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌ను సాధారణ మందులుగా భావించి సొంత నిర్ణయంతో తీసుకోవడం సరికాదని CDSCO తాజా సూచనలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, మందులు అవసరమైనప్పుడు వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలని అధికారులు సూచించారు.

ADVERTISEMENT