Anushka Shetty: ట్రైలర్ వచ్చి ఏడు నెలలు.. ఇంకా విడుదల కాని అనుష్క 'కథనార్'!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాలు చేయకపోయినా కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలు, సినిమా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటారు. అయితే సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనుష్క అభిమానులు ఆమె కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
'ఘాటీ' తర్వాత మరో సినిమా ప్రకటన ఏదీ?
అనుష్క చివరిగా నటించిన 'ఘాటీ' సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. అయినప్పటికీ ఆమె నుంచి మరో కొత్త సినిమా ప్రకటన రాలేదు.
మరోవైపు మలయాళంలో మూడేళ్ల క్రితం అంగీకరించిన 'కథనార్' సినిమా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు.
ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఏడు నెలలు దాటుతున్నా.. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
15 భాషల్లో 'కథనార్' విడుదలకు ప్లాన్
మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో 'కథనార్' తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క నీల అనే కీలక పాత్రలో కనిపించనుంది.
శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల కోసం అనుష్క అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
పుట్టినరోజున కూడా అప్‌డేట్ రాకపోవడంతో నిరాశ
నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా అయినా 'కథనార్' నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు.
కానీ వారికి నిరాశే ఎదురైంది. కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చిత్రబృందం నుంచి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వీటీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
వివరాలు
'బాహుబలి 3'లో అనుష్క ఉంటారా?
అనుష్క కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా 'బాహుబలి 3' ఉండొచ్చనే ప్రచారం గతంలో జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.
అనుష్క కొత్త సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారు? 'కథనార్' ఎప్పుడు విడుదలవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియని పరిస్థితి నెలకొంది.
సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. త్వరలోనైనా అభిమానులకు ఏదైనా స్వీట్ న్యూస్ చెబుతారేమో చూడాలి.