Loading...
King Movie: కింగ్‌...విడుదలకు ముందే రూ. 665 కోట్లు బిజినెస్‌?
కింగ్‌...విడుదలకు ముందే రూ. 665 కోట్లు బిజినెస్‌?

King Movie: కింగ్‌...విడుదలకు ముందే రూ. 665 కోట్లు బిజినెస్‌?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 03, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు ఎంత వస్తాయోనని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. కానీ బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మాత్రం తన కొత్త సినిమా కింగ్‌తో విడుదలకు ముందే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 665 కోట్లకు చేరినట్లు సమాచారం. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల రూపంలో ఈ భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఇంతటి వ్యాపారం జరగడం ఇప్పుడు బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది.

Details

ఓవర్సీస్ హక్కులకే రూ. 175 కోట్లు

ఈ డీల్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఓవర్సీస్ మార్కెట్. ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ విదేశీ పంపిణీ హక్కులను కనీస గ్యారెంటీ పద్ధతిలో రూ. 175 కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ సమాచారం.

భారతీయ సినిమా చరిత్రలో ఓవర్సీస్ హక్కులకు సంబంధించి ఇదే అతిపెద్ద ఒప్పందమని ప్రచారం జరుగుతోంది. ఇక దేశీయ థియేట్రికల్ హక్కులను పెన్ మరుధర్ సంస్థ రూ. 250 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అంటే థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 425 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

Details

ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కులతో భారీ ఆదాయం

థియేటర్లతో పాటు ఇతర హక్కుల విషయంలోనూ కింగ్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 150 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

అయితే థియేటర్లలో సినిమా ప్రదర్శన ఆధారంగా ఈ మొత్తంలో మార్పులు ఉండేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు రూ. 25 కోట్లకు, మ్యూజిక్ హక్కులు రూ. 65 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలన్నీ కలిపితే ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 665 కోట్లకు చేరుతుంది.

ADVERTISEMENT

Details

రూ. 500 కోట్లు దాటనున్న నిర్మాణ వ్యయం?

ఇంతటి బిజినెస్ వెనుక భారీ నిర్మాణ వ్యయం కూడా ఉంది. మొదట ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించినప్పటికీ, ప్రస్తుతం నిర్మాణ ఖర్చు దాదాపు రూ. 400 కోట్లకు చేరినట్లు సమాచారం.

ఇందులో షారుఖ్ పారితోషికం కలపలేదని తెలుస్తోంది. ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కూడా జోడిస్తే మొత్తం బడ్జెట్ రూ. 500 కోట్లు దాటే అవకాశం ఉంది.

దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ADVERTISEMENT

Details

తండ్రి కూతుళ్ల కలయికతో మరింత ఆసక్తి

పఠాన్ తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో షారుఖ్ చేస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే కింగ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరో ప్రత్యేకత ఏమిటంటే, తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి షారుఖ్ తొలిసారి తెరపై కనిపించనున్నారు. నవంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని తొలి పాటను విడుదల చేసి ప్రచారాన్ని మొదలుపెట్టారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలకు ముందే రూ. 665 కోట్ల వ్యాపారం చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT